చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు.. హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చివరి మూవీ ఇదే!

  • By: Somu    news    Nov 11, 2023 12:59 PM IST
చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు.. హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చివరి మూవీ ఇదే!
  • సినీ నటుడు చంద్రమోహన్ అస్తమయం
  • సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
  • హైద్రాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు


విధాత : సినీ నటుడు చంద్రమోహన్ (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9:45 గంటలకు మరణించారు. చంద్రమోహన్‌ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఆమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1941 మే 23న చంద్రమోహన్‌ జన్మించారు. అతను మేడూరులోని వైవీఆర్‌ఎంజడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించి, బాపట్ల వ్యవసాయ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. చంద్రమోహన్‌కు చిన్నయ్య అనే సోదరుడు, అక్కడ సత్యవతి ఉన్నారు. అతను ప్రముఖ సినీ నిర్మాత కె. విశ్వనాథ్ బంధువు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు చంద్రమోహన్‌ 1966లో రంగుల రాట్నం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1968లో వాణిశ్రీకి కేరింగ్ బ్రదర్‌గా సుఖ దుఃఖాలు చిత్రంలో నటించి అవార్డులు అందుకున్నారు.



 


మొత్తం 932సినిమాల్లో వివిధ రకాల పాత్రలను పోషించిన చంద్రమోహన్‌ 175 పైగా సినిమాల్లో హీరోగా నటించారు. కమెడియన్‌గా, సహాయ నటుడిగా కూడా చంద్రమోహన్ పలు రకాల పాత్రలను పోషించి మెప్పించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్ర మోహన్ పక్కన మొదటి సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ అవుతారనే సెంటిమెంట్ ఉంది. ఆయనతో సుమారు 60 మంది హీరోయిన్లుగా చేశారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ సహా పలువురు ప్రముఖ హీరోయిన్లకు తొలి హీరో చంద్ర మోహన్. వాళ్ళ ప్రతిభ వల్ల ఆయా హీరోయిన్లు ఉన్నత స్థానానికి చేరుకున్నారు తప్ప… అందులో తన ప్రమేయం ఏమీ లేదని రెండు మూడు సందర్భాల్లో చంద్ర మోహన్ చెప్పారు. అయితే ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ అనే సెంటిమెంట్‌ మాత్రం అప్పట్లో బలంగా ఉండేది. అత్యధికంగా చంద్రమోహన్‌తో జయసుధ 34సినిమాల్లో నటించారు.


అవార్డుల చంద్రుడు


చంద్రమోహన్ తన నటనతో సౌత్‌లో ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు, రెండు నంది అవార్డులను అందుకున్నాడు. రంగుల రత్నం (1966) వంటి బాక్సాఫీస్ హిట్‌లలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. పదహారేళ్ల వయసు (1978) కోసం అతను ఫిల్మ్‌ఫేర్, నంది ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు), సిరిసిరి మువ్వ (1978)కు ఉత్తమ నటుడు నంది అవార్డు అందుకున్నారు.అతని మొదటి తమిళ చిత్రం నాలై నమధే (1975), సీతామాలక్ష్మి (1978), రామ్ రాబర్ట్ రహీమ్ (1980), రాధా కళ్యాణం (1981), రెండు రెళ్ళు ఆరు (1986), చందమామ రావే (1987) చిత్రాల్లో అతను హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. జీవన తరంగాలు, సంబరాల రాంబాబు, ఆధిత్య 369, అల్లూరి సితారామరాజు, పెద్దరికం వంటి చిత్రాల్లో అలరించారు. చందమామ రావే (1987) చిత్రానికి ఉత్తమ హాస్యనటుడు, అతనొక్కడే (2005)కు ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డులు పొందారు. 2017లో చివరగా అక్సిజన్ సినిమాలో కనిపించారు. 2021లో చంద్రమోహన్‌కు తెలుగు బుక్ ఆప్ రికార్డు వరించింది.


ప్రముఖుల సంతాపం


చంద్రమోహన్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌, నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, ప్రముఖ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌, బాలకృష్ణ, వెంకటేశ్‌, జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్, మంచు విష్ణు, సాయి థరమ్‌తేజ్‌ తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు.