చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్‌… మాట‌లు రావ‌డం లేదంటూ ఎమోష‌న‌ల్

చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్‌… మాట‌లు రావ‌డం లేదంటూ ఎమోష‌న‌ల్

ప్రతి ఏడాది గణతంత్ర దినత్సవానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ప‌ద్మ అవార్డ్స్ 2024ని ప్ర‌క‌టించింది. ఐదుగురు పద్మ విభూషణ్, 17 మంది పద్మ భూషణ్ తో పాటు 110 మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. పద్మవిభూషణ్‌ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఉండ‌డంతో ఆయ‌నకి ప్ర‌ముఖుల నుండి ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది. ఇక త‌న‌కి ఇంతటి ప‌త్రిష్టాత్మ‌క అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తాను తెలియడం లేదని చెప్పుకొచ్చారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలియ‌జేశారు.

కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు.. నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను నేడు ఈ ఉన్నత స్థితిలో నిలిచాన‌ని, త‌న‌కి ద‌క్కిన ఈ గౌరవం త‌న‌ని ఆద‌రించేవారిదని మెగాస్టార్ తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటూఎమోషనల్ అయ్యారు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో నిత్యం వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ.. అభిమానులకు వినోదం పంచుతున్నాననీ, తన శక్తి మేర ఎంటర్టైన్ చేస్తున్నననీ చిరంజీవి స్ప‌ష్టం చేశారు. తన నిజ జీవితంలోనూ అపదలో ఉన్నావారికి తనకు తోచిన సాయం చేస్తున్నానన్నారు. తనపై మీరు చూపిస్తున్న కొండంత ప్రేమకు తాను ప్రతిగా ఇస్తున్నది గోరంతనేననీ, తనకు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుందనీ చిరు పేర్కొన్నారు.

ఇలాంటి అవార్డులతో తనని ప్రోత్సహిస్తుండటంతో తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని అన్నారుచిరంజీవి. తనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిరు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.ఇక చిరంజీవికి మెగా ఫ్యామిలీ స‌భ్యుల‌తో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక చిరంజీవితో పాటు వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు, వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్‌, బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బిహార్‌, పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు కూడా ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు.