రాజస్థాన్ కరన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది.. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

- మంత్రిపై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్‌సింగ్ విజయం
- రాజకీయంగా సంచలనం రేపిన ఎన్నిక
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హుషారు మీద ఉన్న రాజస్థాన్ బీజేపీకి అక్కడి కరన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. ఏకంగా మంత్రిని ఓడగొట్టి, కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ కూనెర్‌ను గెలిపించారు. కరన్‌పూర్ నియోజకవర్గానికి ఆదివారం పోలింగ్ నిర్వహించగా.. సోమవారం ఓట్లు లెక్కించారు. ఈ విషయంతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ బలం 69 నుంచి 70కి పెరిగింది. బీజేపీ 115 స్థానాలతో ఉన్నది. తన సమీప బీజేపీ ప్రత్యర్థి, రాష్ట్ర మంత్రి సురేందర్‌పాల్ సింగ్‌పై రూపిందర్ సింగ్ కూనెర్ 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. విజయం సాధించిన రూపిందర్‌ను మాజీ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్ ఎక్స్‌లో అభినందించారు. ఈ విజయం ఈ నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలందించిన రూపిందర్ తండ్రి, గత శాసనసభలో సభ్యుడు దివంగత గుర్మీత్‌సింగ్ కూనెర్‌దేనని పేర్కొన్నారు. ఆయన మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.
బీజేపీ గర్వాన్ని కరన్‌పూర్ ప్రజలు ఓడించారని గెహ్లాట్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల సమయలో కనీస నైతిక లేకుండా, ప్రవర్తనా నియమావళిని సైతం ఉల్లంఘించి తమ అభ్యర్థిని ఏకంగా మంత్రిని చేసి మరీ ఎన్నికల్లో నెలబెట్టిన బీజేపీకి గుణపాఠం చెప్పారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే అభ్యర్థిని మంత్రిని చేయడం ఓటర్లను మభ్యపెట్టడమే అవుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సరేందర్‌పాల్ సింగ్‌ను స్వతంత్ర హోదాలో మంత్రిని చేసి, నాలుగు పోర్టుఫోలియోలు అప్పగించారు.