ఎన్నికల ప్రచారంలో ‘అంబానీ’, ‘అదానీ’!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి అధికార, ప్రతిపక్ష పార్టీలు భారతదేశపు కుబేర పారిశ్రామిక వేత్తలు ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీని లాగాయి. ఈ ఇద్దరు శతకోటీశ్వరులు ఇచ్చిన ఎన్నికల విరాళాలపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి

ఎన్నికల ప్రచారంలో ‘అంబానీ’, ‘అదానీ’!

వారి నుంచి కాంగ్రెస్‌కు నల్లధనం అందిందా?
తెలంగాణ ప్రచారంలో ప్రధాని మోదీ
వాళ్లు నల్లధనం పంపితే.. ఈడీ, సీబీఐతో విచారణ జరపాలి
ఎట్టకేలకు వాళ్ల వద్ద నల్లధనం ఉందని ఒప్పుకొన్న మోదీ
కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక, జైరాంరమేశ్‌, గెహ్లాట్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి అధికార, ప్రతిపక్ష పార్టీలు భారతదేశపు కుబేర పారిశ్రామిక వేత్తలు ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీని లాగాయి. ఈ ఇద్దరు శతకోటీశ్వరులు ఇచ్చిన ఎన్నికల విరాళాలపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చేసే విమర్శల్లో రాహుల్‌ గాంధీ ఎందుకు అంబానీ, అదానీ పేర్లను ప్రస్తావించడం ఆపేశారని తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తొలుత ఈ అంశాన్ని ప్రధాని మోదీ లేవనెత్తారు. వారి నుంచి కాంగ్రెస్‌కు రాజకీయ విరాళాలు అందాయా? అని సందేహం వ్యక్తం చేశారు.

వాళ్లపై విమర్శలను ఆపేందుకు అంబానీ, అదానీ నుంచి ట్రక్కుల్లో నల్లధనం అందిందా? అని ప్రశ్నించారు. ‘ఐదేళ్లుగా వాళ్లు అదానీ, అంబానీపై విమర్శలు గుప్పించారు. రాత్రికి రాత్రే వాటిని ఆపేశారు. ఇది అనుమానాలు రేకెత్తిస్తున్నది. దానర్థం మీరు కొన్ని ట్రక్కుల దొంగ డబ్బు, నల్లధనం అందుకున్నారా? ఎంత నల్లధనం అందింది? ఈ విషయంలో మీరు జాతికి సమాధానం చెప్పాలి’ అని మోదీ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌నుద్దేశించి ప్రశ్నించారు.

దమ్ముంటే అదానీ, అంబానీల వద్దకు ఈడీ, సీబీఐని పంపండి: రాహుల్‌

మోదీ వ్యాఖ్యలపై అంతే దీటుగా స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. తమ పార్టీకి నల్లధనాన్ని పంపారో లేదో సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించే దమ్ముందా? అని మోదీకి సవాలు విసిరారు. మోదీ తన వ్యక్తిగత అనుభవం నుంచి మాట్లాడుతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. ‘మోదీజీ.. మీరు కొంత భయపడుతున్నారా? అదానీ, అంబానీల గురించి మీరు గది తలుపులు వేసుకున్నప్పుడే మాట్లాడుతారు.

కానీ.. మొదటిసారి అదానీ, అంబానీల గురించి మీరు బహిరంగంగా మాట్లాడుతున్నారు’ అని ఒక వీడియో సందేశంలో రాహుల్‌ పేర్కొన్నారు. ‘వాళ్లు ట్రక్కుల్లో డబ్బులు ఇస్తారని మీకు తెలుసు. ఇది మీ వ్యక్తిగత అనుభవమా? ఒక పని చేయండి.. సీబీఐ లేదా ఈడీని వారివద్దకు పంపండి. లోతుగా దర్యాప్తు చేయండి. కానీ.. భయపడకండి’ అని రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ అవినీతి ట్రక్కుకు డ్రైవర్‌ ఎవరో, హెల్పర్‌ ఎవరో దేశం మొత్తానికి తెలుసు’ అని ఎక్స్‌లో ఉంచిన వీడియోలో రాహుల్‌ విమర్శించారు.

అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారా?: ప్రియాంక

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం తీవ్రంగా స్పందించారు. రాహుల్‌ గాంధీ గురించి యావత్‌ బీజేపీ యంత్రాంగం పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తున్నదా? అని ప్రశ్నించారు. ‘అదానీ, అంబానీ పేర్లను నేరుగా రాహుల్‌ ప్రస్తావించకున్నా.. వారిద్దరి గురించి ప్రతి సమావేశంలో చెబుతున్నారు. వాళ్ల గురించిన నిజాలను ఆయన ప్రజల ముందు ఉంచుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలతో బీజేపీ మిలాఖత్‌ అయిందని ప్రతిరోజూ మేం ప్రజలకు చెబుతూనే ఉన్నాం’ అన్నారు.

వాళ్ల వద్ద నల్లధనం ఉందని మీకు తెలుసా?: జైరాం రమేశ్‌

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కూడా మోదీ టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. ‘స్పష్టమైన మెజార్టీ రావటం లేదని మోదీకి అర్థమైంది. అందుకే ఆయన దిగ్భ్రమలో ఉండి.. తన సొంత స్నేహితులపైనే దాడి చేస్తున్నారు’ అని విమర్శించారు. ‘హమ్‌ దో హమారే దో పప్పా ఏం చెబుతున్నాడు? తన ఇద్దరు స్నేహితులు అంబానీ, అదానీ వద్ద ట్రక్కుల కొద్దీ నల్లధనం ఉందని చెబుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రధానీ.. మీ సంచలన ప్రకటనతో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది 2016 నవంబర్‌ 8వ తేదీన మీరు టీవీల ముందుకు వచ్చి పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించారు.

ఈ రోజు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరు వ్యాపారవేత్తల వద్ద సంచుల కొద్దీ నల్లధనం ఉన్నదని చెబుతున్నారు. రెండో అంశం.. అవినీతికి పాల్పడ్డారంటూ ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టిన మీరు.. ఈ ఇద్దరు వ్యక్తుల వద్ద అంత నల్లధనం ఉంటే.. ఈడీ, సీబీఐ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు? ఈడీ, సీబీఐలు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాయా?’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. ‘గడిచిన పదేళ్లలో ప్రైవేటీకరణ జరుగుతున్నది. ప్రతిదీ వాళ్లకు అమ్మేస్తున్నారు’ నల్లధనం ఎక్కడి నుంచి వస్తున్నది? మీరు సమాధానం చెప్పాలి. అసలు నిజం ఏంటంటే.. మీరు దిగ్భ్రమలో ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌ 4వ తేదీన మీకు స్పష్టమైన మెజార్టీ రాదని మీకు తెలిసిపోయింది. అందుకే మీరు అన్ని రకాల అంశాలను లేవనెత్తుతున్నారు’ అని ఆయన విమర్శించారు.

అదానీ, అంబానీల వద్ద నల్లధనం ఉందని మోదీ అంగీకరించారు: గెహ్లాట్‌

అదానీ, అంబానీల వద్ద పెద్ద ఎత్తున నల్లధనం ఉందన్న విషయాన్ని మోదీ అంగీకరించినట్టయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు. ‘బాగుంది.. మొత్తానికి పదేళ్లుగా తాను టచ్‌ చేయడానికి భయపడిన అదానీ, అంబానీల వద్ద పెద్ద ఎత్తున నల్లధనం ఉందని మోదీ బహిరంగంగానే చెప్పారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘డబ్బులతో ఉన్న సంచులు, ట్రక్కులను ఎక్కడ ఖాళీ చేశారో కూడా మోదీ చెప్పాలి’ అన్నారు. ‘రాహుల్‌గాంధీ సత్యం కోసం దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అంతిమ విజయం సత్యానిదే. జూన్‌ 4న సత్యం జయిస్తుంది’ అని రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన గెహ్లాట్‌ తన పోస్టులో పేర్కొన్నారు.