Bihar Assembly Elections | బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఎంపిక వెనుక!
ఎట్టకేలకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. దీని వెనుక చాలా అంశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Bihar Assembly Elections | గత కొన్నివారాలుగా సాగుతున్న ప్రతిష్ఠంభనకు తెర దించుతూ మహాఘట్ బంధన్.. తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉంటారని అధికారికంగా ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామన్న ఆర్జేడీ.. తన పంతం నెగ్గించుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నోరు మెదపని కాంగ్రెస్.. అనివార్య పరిస్థితుల్లో తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకమైన అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా కూటమి తన విజయావకాశాలను మెరుగుపర్చుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ మొత్తం తతంగం వెనుక చాలా అంశాలే ఉన్నాయని తెలుస్తున్నది. అధికార ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలపైనే ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్న తరుణంలో, ఒక విధంగా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో ఊహించని దెబ్బగా ఈ పరిణామాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇలా మొదలైంది…
గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరున్న అశోక్ గెహ్లాట్ స్వయంగా తేజస్వి యాదవ్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రకటించారు. అంతకు ముందు రోజే ఆయన పాట్నాలో తేజస్వి యాదవ్‌ను, ఆయన తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌ను వారి నివాసంలో కలిశారు. కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న ప్రకటన వెలువడేందుకు అక్కడే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఇండియా కూటమి తొలి మీడియా సమావేశాన్ని గురువారం నిర్వహించింది. ఈ సమావేశంలోనే అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదలుకుని.. కూటమిలో అందరు నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండాలని మొదటి నుంచీ గట్టిగా భావించారని గెహ్లాట్ చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటిస్తున్నాం. అతడు యువకుడు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇది అంతా కలిసి తీసుకున్న మంచి నిర్ణయం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.
మొన్నటిదాకా దాటవేసి..
నిజానికి రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీహార్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవారు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాల్లో ఉందనే అంచనాలు వచ్చాయి. బీహార్ రాజకీయాల్లో యాదవ్‌లకు ప్రాబల్యం ఉంది. ఆ ప్రాబల్యం తమ రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తున్నదనే భావనా వారిలో ఉన్నది. ఈ సమయంలో తేజస్వి యాదవ్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ముందుకు తెస్తే .. యాదవేతర బలహీన వర్గాలు కూటమికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదనను కాంగ్రెస్ నాయకత్వం వినిపిస్తూ వచ్చింది. కానీ.. ఆ వాదనను ఆర్జేడీ వ్యతిరేకించడం, కూటమి భాగస్వామ్య పక్షాలు సైతం తేజస్వికే మద్దతు పలకడంతో కాంగ్రెస్ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి వస్తే ఒకరికంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకోవాలనే నిర్ణయానికి నాయకులు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం ముఖేశ్ సాహ్ని పేరు డిప్యూటీ సీఎం పదవి కోసం ప్రకటించారు. ఆయన వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ నేత. ఇతర అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలు, ముస్లింలను కూడా తమకు సానుకూలంగా ఉంచుకునేలా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని గెహ్లాట్ మాటలను బట్టి అర్థమవుతున్నది. గురువారం నాటి మీడియా సమావేశంలో ఇండియన్ ఇన్‌క్లూసివ్ పార్టీ కూడా ఉంది. ఇది తంతి–తత్వా (చేనేత) వర్గాలతోపాటు పాన్ (ఎస్సీల్లోని ఉపకులం.. ఇప్పుడు ఎస్సీల్లో లేదు) కమ్యూనిటీలో మాస్ బేస్ కలిగి ఉన్నది. తమకు గతంలో ఉన్న ఎస్సీ హోదాను పునరుద్ధరించాలని ఐపీ గుప్తా నేతృత్వంలో ఆ పార్టీ పోరాడుతున్నది. ఇదే సమావేశంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, సీపీఎం నేతలు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఒక విస్తారమైన సంకీర్ణం ఏర్పరుస్తామనే సంకేతాన్ని ఈ మీడియా సమావేశం ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్డీయేకు ఇరకాటం!
ఇప్పటికీ నితీశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించేందుకు బీజేపీ సంకోచిస్తూనే ఉన్నది. ఇదే విషయంలో మహాఘట్‌బంధన్.. ఎన్డీయేను కార్నర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. తాము నితీశ్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారే కానీ.. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఒక్క మాట చెప్పడానికి సాహసించలేదు. ‘గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏక్‌నాథ్ షిండే మా నాయకుడన్నారు.. కానీ.. ఎన్నికల తర్వాత ఆయనకు సీఎం సీటు దక్కలేదు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది’ అని గెహ్లాట్ అన్నారు.
వాస్తవానికి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడానికి కాంగ్రెస్ కూడా వెనుకాడింది. కానీ.. కూటమిలోని ఇతర పక్షాల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని తెలుస్తున్నది.