Shamshabad Lagacharla Road | శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
శంషాబాద్ నుంచి లగచర్ల వరకూ ప్రతిపాదించిన వంద మీటర్ల రేడియల్‌రోడ్డుతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ పెరుగుతుంది. షాబాద్, పరిగి, చేవెళ్ల, కొడంగల్ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయసంగా రాకపోకలు సాగించవచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీకి లింక్ రావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు రానున్నాయి.
విధాత, హైదరాబాద్:
Shamshabad Lagacharla Radial Road | వికారాబాద్ జిల్లా కేంద్రానికి మరో కొత్త రోడ్డును నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడెమీ (టీజీపీఏ) నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా ఒక రోడ్డు ఉండగా, గండిపేట నుంచి శంకరపల్లి మీదుగా మరో రోడ్డు వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు అందుబాటులో ఉంది. కొత్తగా మరో రోడ్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ రోడ్డుతో ప్రస్తుత రోడ్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సూర్యాపేట రాకపోకలు చేసేవారికి అనువుగా ఉండనున్నది. వంద మీటర్ల వెడల్పు (330 అడుగులు) తో నిర్మాణం చేయనున్న రోడ్డు కోసం హెచ్ఎండీఏ భూ సేకరణ అధికారులు సర్వే ప్రారంభించారు. లగచర్లను పారిశ్రామిక కారిడార్‌గా డెవలప్ చేసేందుకు నూతన అలైన్‌మెంట్ ప్రతిపాదించారు.
లగచర్ల ప్రాంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి తొలుత నిర్ణయించారు. ఫార్మా విలేజ్ కోసం సుమారు 1,314 ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించగా, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూసేకరణపై ప్రజల అభిప్రాయం సేకరించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, భూ సేకరణ అధికారులపై రైతులు తిరుగుబాటు చేయడం, విధ్వంసానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు బాధ్యులైన పలువురిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
ఈ ఘటన తరువాత రేవంత్ రెడ్డి సర్కార్ లగచర్ల భూ సేకరణను రద్దు చేసింది కూడా. తాజాగా పారిశ్రామిక కారిడార్ కోసం భూ సేకరణ ప్రారంభించింది. సుమారు వెయ్యి ఎకరాలను సేకరించగా, ఇవి టీజీఐఐసీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 15 ఎకరాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, ఫిజియో థెరఫీలకు 22 ఎకరాలు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు 3 ఎకరాలు, ఇంజినీరింగ్ కాలేజీకి 7 ఎకరాలు, పశువైద్య కళాశాలకు 27 ఎకరాలు, సైనిక్ స్కూలుకు 11 ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 20 ఎకరాల చొప్పున కేటాయించారు. లగచర్లకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది.
వన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరహాలో అన్ని రకాల విద్యా సంస్థలు వస్తున్నందున శంషాబాద్ నుంచి కొత్తగా రేడియల్ రోడ్డు నిర్మాణం చేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ను ఆదేశించారు. శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16/17 నుంచి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామ సమీపంలోని నేషనల్ హైవే వరకు రేడియల్ రోడ్డు వస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ మండలాల మీదుగా దుద్యాల్ మండలం హకీంపేట, లగచర్ల, చంద్రవంచ వరకు అలైన్‌మెంట్ ఖరారు చేశారు. 80 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రేడియల్ రోడ్డు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే వెనకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్, కోస్గి ప్రాంతాలకు ఎంతో మేలు జరగనున్నది.
కొడంగల్ మండలవ టేకుల్ కోడ్ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండడంతో భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలుత రేడియల్ రోడ్డును హకీంపేట, తొగంపూర్ వరకు రోడ్డు వేయాలని నిర్ణయించారు. హకీంపేటలో ఎడ్యుకేషనల్ హబ్, లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో దీన్ని కూడా కనెక్టివిటీ చేయాలని నిర్ణయించడంతో అలైన్‌మెంట్ మారింది. మొత్తం వంద మీటర్ల వెడల్పు (పది లేన్ల)తో రేడియల్ రోడ్డు నిర్మాణం చేసేందుకు 1,800 ఎకరాలను సేకరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ చట్టం 2013 కింద గత నెల మొదటి వారంలో సమగ్ర సర్వే కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోడ్డు పూర్తయిన తరువాత ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ పెరుగుతుంది. షాబాద్, పరిగి, చేవెళ్ల, కొడంగల్ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయసంగా రాకపోకలు సాగించవచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీకి లింక్ రావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
City Of Lakes | మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు
Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram