CM Revanth Reddy | తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలో ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని నేను, సీతక్క ఫిబ్రవరి 6, 2023న ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించా.. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని నేను, సీతక్క ఫిబ్రవరి 6, 2023న ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించా.. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎం తెలిపారు. మేడారంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గిరిజనుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.
ఆదివాసీ గిరిజన సోదరులందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. నేడు సమ్మక్క సారలమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం తరలివచ్చి ఇక్కడ్నుంచే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను, ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అని సీఎం తెలిపారు.
ఉమ్మడి ఏపీలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాని హైదరాబాద్ దాటి బయట మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్న సందర్భాల్లేవు. ఈ వనదేవతల చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే బ్రహ్మాండంగా బాగుంటుందని అందరూ ముందుకు వచ్చి సహకరించారు అని సీఎం గుర్తు చేశారు.
ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా తలుచుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర. ఈ జాతరకు సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తమను నమ్మిన జనం కోసం కాకతీయుల మీద కత్తి దూసిన వీరవనితలు. ఆ స్ఫూర్తితో తెలంగాణలో జరుగుతున్న ప్రజా కంఠక పాలనను అంతమొందించాలని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడ్నుంచే హత్ సే హత్ జూడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన నాయకులందరం కూడ సమ్మక్క సారాలమ్మను సందర్శించుకుని ప్రతిన బూనాం. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా, ఉత్తరాదిలో కుంభమేళా ఉంటే, దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళా నిర్వహించి, గిరిజనేతరులను ఇక్కడికి రప్పించే విధంగా అద్భుతంగా చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని నిధులు మంజూరు చేశాం. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, మా ఇంటి ఆడబిడ్డ సీతక్క కలిసి తల్లీబిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్చికమేమో కానీ ఇది దైవాపేక్ష అని భావిస్తున్నాను. ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో జాతరకు ఏర్పాట్లు చేసే అవకాశం సోదరిమణులతో పాటు నాకు ఇచ్చాడు. ఇదొక అద్భుతమైన సన్నివేశం అని రేవంత్ పేర్కొన్నారు.
మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా ఆరునూరైనా జనవరి 28వ తేదీలోపు ఇక్కడ పనులు పూర్తి చేయాలి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యత అప్పజెప్పితే.. ఇక్కడే ఉండి ప్రతి పసందర్భంలో పర్యవేక్షిస్తూ పనులను కొనసాగించారు. ఆర్థిక మంత్రి అవసరం మేరకు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యాయని రేవంత్ తెలిపారు.
ప్రతి మనిషి 50 ఏండ్లో, 60 ఏండ్లో జీవిస్తాడు. ఆ మనిషి మరణించిన తర్వాత ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని తిరిగి చూసుకుంటే శూన్యం కనిపిస్తది. నాకు మరణం కలిగినప్పుడు నేను వెనక్కి తిగిరి చూసుకున్నప్పుడు ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఒక పుణ్యక్షేత్రం అందించిన సంతృప్తి కలుగుతుంది. 800 ఏండ్ల చరిత్ర కలిగిన సమ్మక్క, సారలమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కత్తి దూసిన ఆడబిడ్డల జాతరకు ఏర్పాట్లు చేయడం గుర్తిండిపోయే సన్నివేశం అని సీఎం పేర్కొన్నారు.
ఫిబ్రవరి 6, 2023లో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి వర్గాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. మొక్కును చెల్లించుకున్నాం. కచ్చితంగా ఇక్కడ తిరుపతి స్థాయిలో, కుంభమేళా స్థాయిలో భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు.. ఏర్పాట్లు అభివృద్ది చేస్తాం. జంపన్నవాగుతో పాటు వసతులు మెరుగుపరుస్తాం. రామప్ప నుంచి లక్నవరం వరకు పైపులైన్‌తో జంపన్నవాగులో నిరంతరం నీళ్లు ఉండేలా చేస్తాం. పవిత్ర స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు శాశ్వతంగా నీటి సదుపాయం కల్పిస్తాం. ఎవరు ఏమనుకున్నా బాధ లేదు. ఇంత ఆలస్యమైనా వేలాది మంది ఎదురుచూస్తున్నారంటే ఒక్క మంచి పని చేసిందుకు ఆశీర్వదిస్తున్నారని భావిస్తున్నా. రేపు ఉదయం మేడారం ఆలయాన్ని భక్తులకు అంకితం చేస్తాం. మిగిలిన పనులను తొందర్లోనే పూర్తి చేసి ప్రతి ఏడాది కోట్లాడి మంది భక్తులు వచ్చేలా అభివృద్ధి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram