City Of Lakes | మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు

రాజస్థాన్ రాజసం, అద్భుతమైన సరస్సుల కలయికే 'ఉదయ్‌పూర్'. భారతదేశపు 'సిటీ ఆఫ్ లేక్స్' విశేషాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు మరియు ఉత్తమ సమయం గురించి పూర్తి వివరాలు.

City Of Lakes | మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు

భారతదేశం (India) విభిన్న సంస్కృతులు, ప్రకృతి దృశ్యాలు, చారిత్రాత్మక నగరాలకు నిలయం. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ రాష్ట్రం సిల్క్‌కు ప్రసిద్ధి అయితే, మరో రాష్ట్రం టీకి, ఇంకొకటి స్వీట్స్‌కి ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. అలానే దేశంలో రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రానికి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా లేక్స్‌కు (Lakes) ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. అపారమైన నీటి వనరులు, రాజ భవనాలు, చారిత్రాత్మక వాస్తుశిల్పాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటుంది రాజస్థాన్‌.

వెడ్డింగ్‌ స్పాట్‌..

పూర్వకాలం రాజుల నాటి చరిత్ర, అలాంటి రాజుల చరిత్ర పాలన గురించి తెలుసుకోవాలంటే రాజస్థాన్‌ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందేనని అంటుంటారు. ఈ రాష్ట్రంలోని ఒక్కో నగరానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అందులో ఉదయ్‌పూర్‌ ఒకటి. వెడ్డింగ్స్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉదయ్‌పూరే. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకునే వాళ్లకు ఉదయ్‌పూర్‌ బెస్ట్‌ ప్లేస్‌ అనే చెప్పాలి. ప్యాలెస్​లు, సరస్సులకు ఉదయ్‌పూర్‌ (Udaipur) నగరం పెట్టింది పేరు. ఉదయ్‌పూర్ ప్యాలెస్ చాలామందికి ఫేవరెట్. అక్కడ లేక్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్‌, ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌ వంటి వేదికలున్నాయి.

లేక్స్‌కు ప్రసిద్ధి..

ఉదయ్‌పూర్‌లోని తెల్లని పాలరాయి రాజభవనాలు, చారిత్రాత్మక కట్టడాలు, ప్రకృతి అందాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో అక్కడి వాతావరణం కట్టిపడేస్తుంది. ఇక అక్కడి సరస్సులు పర్యాటకాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సరస్సుల్లో లేక్‌ పిచోలా, ఫతే సాగర్‌ సరస్సు, ఉదయ్‌ సాగర్‌ సరస్సు, స్వరూప్‌ సాగర్‌ ప్రసిద్ధి చెందినవి. ఈ సరస్సులు నగర అందాన్ని పెంచడమే కాదు.. బోటింగ్‌ అనుభవాలు, లేక్‌ సైడ్‌ కేఫ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ ఆ లేక్‌ పక్కన అలా నడుచుకుంటూ వెళ్తే వచ్చే అనుభూతి మామూలుగా ఉండదు. సరస్సుల పక్కన ఫొటోలు దిగుతూ పర్యాటకులు ప్రత్యేక అనుభూతిని పొందుతారు.

ఉదయ్‌పూర్‌లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..

సిటీ ప్యాలెస్ – శిల్పాలు, మ్యూజియాలకు ప్రసిద్ధి
పిచోలా సరస్సు – బో‌ట్‌ రైడ్స్‌, అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి
జగ్ మందిర్ – పిచోలా సరస్సులో ఉన్న ఒక అందమైన ద్వీప ప్యాలెస్
ఫతే సాగర్ సరస్సు – బోటింగ్, సన్‌సెట్‌ వ్యూకి ప్రసిద్ధి
సహేలియోన్ కి బారి – ఫౌంటెన్లు, గ్రీనరీకి ఫేమస్‌
జగ్దీష్ ఆలయం – హిందూ టెంపుల్‌

ఏ సమయంలో సందర్శించాలి..

ఉదయ్‌పూర్‌ను అక్టోబర్‌- మార్చి మధ్య సందర్శించడం మంచిది. ఆ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య వాతావరణం వేడిగా ఉంటుంది. అయితే, ఆ సమయంలో హోటల్‌ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. బడ్జెట్‌ పరంగా చూసుకుంటే ఈ సమయంలో విజిట్‌ చేయడం మంచిది. జులై-సెప్టెంబర్‌ మధ్య వర్షాకాలం. సరస్సులు మరింత అందంగా కనిపిస్తాయి. ఆ సమయంలో పర్యాటకులు కూడా తక్కువగా ఉంటారు.

ఇవి కూడా చదవండి :

Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్‌ పెట్టండి
Harish Rao | దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్