Congress, RJD Rift? | బీహార్‌లో కీలక స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ స్నేహపూర్వక పోటీ?
ఒకవైపు నామినేషన్ల దాఖలు గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్లలో స్నేహపూర్వక పోటీలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Congress, RJD Rift? | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి రావడం లేదు. మొత్తం 243 స్థానాలకు గాను రెండో దశలో 122 సీట్లకు నామినేషన్ల సమయం కూడా దగ్గర పడుతున్నది. అయినా.. రెండు పార్టీల మధ్య నిర్దిష్ట ఒప్పందం ఏదీ ఇప్పటి వరకూ కుదరలేదు. దీంతో పలు సీట్లలో స్నేహపూర్వక పోటీలకు తెరలేచే అవకాశం కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. అయితే.. తొలి జాబితా 48 మందితో విడుదల కాగా, రెండో జాబితాతో మరో ఐదుగురి పేర్లను ప్రకటించారు. మరోవైపు ఆర్జేడీ మౌఖికంగా కొందరు తన పార్టీ అభ్యర్థులకు బీఫారాలు కూడా అందించింది. వారిలో సుమారు 60 మంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే.. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ రామ్ తీవ్రస్థాయి ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తేజస్వి తన వైఖరిని మార్చుకున్నారని, మహాఘట్ బంధన్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘కేసీ వేణుగోపాల్‌తో సమావేశానికి పూర్తి సహకార ధోరణితో వచ్చారు. కానీ.. ఇప్పుడు ఆయన చర్యలను గమనిస్తే ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతున్నది’ అని రాజేశ్ రామ్ అన్నారు. కూటమిలో దళితుల ప్రాతినిధ్యాన్ని కూడా ఆయన విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకించి రాజేశ్ రామ్ పోటీ చేస్తున్న ఎస్సీ రిజర్వుడు స్థానమైన కుటుంబా నియోజకవర్గంలో ఆర్జేడీ సురేశ్ ప్రభును నిలబెట్టడం గమనార్హం. ఇప్పటి వరకూ రాజేశ్, సురేశ్ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ స్థానానికి రెండో విడుతలో నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ఇప్పటి వరకూ అధికారికంగా రెండు లిస్టులు విడుదల చేసినప్పటికీ.. ఆర్జేడీ అధికారికంగా ఒక్క జాబితా కూడా విడుదల చేయలేదు. అయినా.. కొందరు నాయకులకు టికెట్లు ఇస్తున్నది. రాజేశ్ వ్యాఖ్యలపై ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి నేరుగా స్పందించనప్పటికీ.. జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ నిశితంగా గమనిస్తున్నదని, కూటమిలో సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఆర్జేడీ ప్రధానంగా బీహార్‌లోనే పోటీ చేస్తుందని, కర్ణాటక, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో సీట్లు అడగలేదన్న తివారీ.. ఈ విషయాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని కోరారు. ‘కూటమిలో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతూనే ఉంటాయి. అయితే.. కాంగ్రెస్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్జేడీ బీహార్ ఎన్నికల్లో, జార్ఖండ్‌లోని కొన్ని సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి మేం సీట్లు డిమాండ్ చేయడం లేదు. క్షేత్రస్థాయి వాస్తవాలను కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. ఇంకా సమయం ఉంది. మహాఘట్‌బంధన్ పార్టీల కీలక నాయకులందరూ కూర్చొని, చర్చించి, సమస్యను పరిష్కరించుకుంటాం’ అని తివారీ ఆదివారం ఏఎన్‌ఐకి చెప్పారు.
ఇదెలా ఉన్నప్పటికీ కొన్ని సీట్లలో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య స్నేహపూర్వక పోటీ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటిలో లాల్‌గంజ్, వైశాలి, రాజపాకర్, రోసేరా, బిహార్‌షరీఫ్, బచ్చావారా, తారాపూర్, కుటుంబ, కహాల్‌గావ్ ఉన్నాయి. రెండో దశ నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు. తొలి విడుత నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా సోమవారమే. రెండో దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం, అక్టోబర్ 23. తొలి దశలో నవంబర్ 6న 121 సీట్లలో పోలింగ్ జరుగనుంది. రెండో దశ పోలింగ్ నవంబర్ 11 ఉంటుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు.