WPL 2026 – RCB vs GG | ఆర్‌సీబీ దూకుడు – 5వ మ్యాచ్‌లోనూ విజయం
WPL 2026లో బెంగళూరు 178/6 భారీ స్కోరు చేసి, గుజరాత్‌ని 61 పరుగుల తేడాతో ఓడించింది. గౌతమీ నాయక్ 73, సయాలీ 3 వికెట్లు ఆర్‌సీబీ విజయానికి కారణం. గుజరాత్ 117 పరుగులకు 8 వికెట్లతో పరాజయం పాలైంది.
WPL 2026: RCB Crush Gujarat Giants by 61 Runs; Gautami Naik’s 73 Powers Bengaluru to Fifth Straight Win
విధాత క్రీడా విభాగం | 19 జనవరి 2026 | హైదరాబాద్:
WPL 2026 – RCB vs GG | వడోదరలో శనివారం జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు తన ఆల్‌రౌండ్ ప్రతిభతో మరోసారి విజయాన్ని ముద్దాడింది. గుజరాజ్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేయగా, ప్రతిగా గుజరాత్ ఛేదనలో తడబడి 8 వికెట్లకు 117 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో విజయం సాధించి, తన అప్రతిహత విజయపరంపరను కొనసాగిస్తూ, టేబుల్ టాపర్‌గా ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
పోటీ ఇవ్వకుండానే లొంగిపోయిన గుజరాత్ జెయింట్స్
179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ జెయింట్స్‌కు ఆదిలోనే దెబ్బ మీద దెబ్బలు తగిలాయి. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, 56 పరుగులకు 6 వికెట్లకు చేరింది. ఇక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన గుజరాత్ చివరికి 18.3 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఆష్లే గార్డనర్ ఒక్కతే అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, ఇద్దరు మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైపోయింది. బెంగళూరు బౌలర్ సయాలీ 3 వికెట్లు తీసుకోగా, మిగతావారందరూ తలో వికెట్ పంచుకున్నారు.
బెంగళూరు రాయల్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు
అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‌లో తమ శక్తిని మరోసారి చాటింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ అశ్లే గార్డ్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆ నిర్ణయాన్ని బెంగళూరు బ్యాటర్లు పెద్ద స్కోరు చేసి సవాల్‌గా మార్చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సీబీ 178/6 పరుగులు చేసి గుజరాత్ జట్టుకు భారీ లక్ష్యాన్ని ముందుంచింది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెంగళూరు బ్యాటర్లు ఆత్మవిశ్వాసంగా ఆడారు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, తడబడకుండా నిలబడి రన్‌రేట్‌ను నిలకడగా కొనసాగించారు. కెప్టెన్ స్మృతీ మంధాన 26 పరుగులు చేయగా, గౌతమీ నాయక్ బెంగళూరు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలబడి 73 పరుగులు చేసింది. రిచా ఘోష్(27) తన దూకుడుతో వేగం పెంచగా, రాధా యాదవ్ మరోసారి దడదడలాడించింది. ఆఖరి 2 బంతులు ఆడటానికి వచ్చిన చిన్నది శ్రేయాంక పాటిల్ ఆ రెండింటికి ఫోర్లుగా బాది, అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి, కష్టసాధ్యమైన లక్ష్యాన్ని గుజరాత్ ముందుంచింది. గుజరాత్ బౌలర్లకు విరామం లేకుండా బెంగళూరు బ్యాటర్లు ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. కెప్టెన్ గార్డనర్, కశ్వీ గౌతమ్ చెరో 2 వికెట్లు తీసుకోగా, రేణుకాసింగ్, సోఫీ డివైన్ తలా ఒకటి తన ఖాతాలో వేసుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram