Bihar Assembly Elections 2025| అక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఆక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఈ నెల 30 నాటికి తుది ఓటర్ల జాబితాల ప్రకటించేసి షెడ్యూల్ ప్రకటనకు సీఈసీ సిద్దమవుతుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణాలోని జూబ్లీహిల్స్ సహా దేశంలో ఖాళీగా పలు అసెంబ్లీ స్థానాలకు ఈ సందర్భంగా ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

న్యూఢిల్లీ : ఆక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తుంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి తుది దశకు చేరుకుంది. ఈ నెల 30 నాటికి తుది ఓటర్ల జాబితాల ప్రకటనకు సీఈసీ సిద్దమవుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలో పాటు ప్రతిపక్షాలు ఓటర్ల జాబితా సవరణలపై అభ్యంతరాలు లెవనేత్తిన నేపథ్యంతో తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈవీఎంల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచనున్నారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్ చోటులో మూడో వంతు అభ్యర్థి ముఖం కనిపిస్తుంది.
బీహార్ లో రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. ఛాత్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా అప్పుడే
బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణాలోని జూబ్లీహిల్స్ సహా దేశంలో ఖాళీగా పలు అసెంబ్లీ స్థానాలకు ఈ సందర్భంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఖాళీగా వున్న అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా అక్టోబర్ మొదటివారంలోనే షెడ్యూల్ వెలువడనుంది. ఈ నెల 30న జూబ్లీహిల్స్ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా వెలువడనుంది.