Mamata Banerjee| ఎస్ఐఆర్ పై సుప్రీంలో సీఎం మమత బెనర్జీ సవాల్.. న్యాయవాదిగా వాదనలు !

పశ్చిమ బెంగాల్ లో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(SIR) ను సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ నేడు బుధవారం కొనసాగనుంది. ఈ కేసు వేసిన సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించేందుకు అనుమతించాలంటూ సీజేఐ సూర్యకాంత్ ను కోరడం ఆసక్తికరంగా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 04, 2026, 4:30 pm IST
Read Time: 6 mins
Mamata Banerjee| ఎస్ఐఆర్ పై సుప్రీంలో సీఎం మమత బెనర్జీ సవాల్.. న్యాయవాదిగా వాదనలు !

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(SIR) ను సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ నేడు బుధవారం కొనసాగనుంది. ఈ కేసు వేసిన సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించేందుకు అనుమతించాలంటూ సీజేఐ సూర్యకాంత్ ను కోరారు. ఆయన అనుమతించిన పక్షంలో కొద్ది సేపట్లో సీఎం మమత బెనర్జీ న్యాయవాదిగా మారి కేసులో తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.

అదే జరిగితే దేశ చరిత్రలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి న్యాయవాదిగా మారి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తన కేసు వాదించనుండటం చరిత్రగా మిగిలిపోనుంది. ఎస్ఐఆర్ ముసుగులో బెంగాల్ లో ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా 58లక్షల మందికి పైగా ఓటర్లను తొలిగించే కుట్ర చేస్తుందని మమత ఆరోపిస్తున్నారు.

వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో ఆమె వాదనలు వినిపించారు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కలిగిన మమతా, ఈ కేసులో తన వాదనలను స్వయంగా వినిపించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ, మధ్యంతర దరఖాస్తును సమర్పించారు. కోర్టు నిబంధనలు, గౌరవ మర్యాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం తానే నేరుగా వాదనలు వినిపిస్తానని ఆమె కోర్టుకు విన్నవించారు. కోర్టు అనుమతితో వాదనలు వినిపించిన మమతా.. ‘సర్‌’ ప్రక్రియకు సంబంధించిన తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసినట్లు ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు. కేవలం తన రాజకీయ పార్టీ కోసం ఈ పోరాటం చేయడం లేదని.. ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం వచ్చినట్లు ఆమె తన వాదనను వినిపించారు.

బెంగాల్‌లో సర్ ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగినట్లు, చిన్నచిన్న కారణాలతో ఓటర్లను తొలగించారని పేర్కొన్నారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు విన్నవించారు. ‘నేను బెంగాల్ ముఖ్యమంత్రిగా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాను. గౌరవనీయ న్యాయమూర్తులపై నాకు అత్యంత గౌరవం ఉంది అన్నారు.

ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

మమత లేవనెత్తిన అంశాలు సీరియస్ గా ఉన్నాయంటూ సీజేఐ సూర్యకాంత్ ఈసీకి నోటీసులు ఇచ్చారు. బెంగాల్ లో అమలవుతున్న ఎస్ఐఆర్ అస్సాంలో ఎందుకు లేదంటు కోర్టు ప్రశ్నించింది. సర్ ప్రక్రియలో రాష్ట్ర అధికారుల పాత్ర ఉండాలని భావించిన కోర్టు, ఓటరు వెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉంచగల గ్రూప్-బి (క్లాస్-2) అధికారుల జాబితాను వచ్చే సోమవారం లోపు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇదే అంశంపై ఇప్పటికే ఈసీ దాఖలు చేసిన పిటిషన్లు ఉండగా.. వాటిని కూడా అనుబంధ పిటిషన్లతో కలిపి ఈ కేసును వచ్చే సోమవారం (ఫిబ్రవరి 9) మళ్లీ విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.