Indore Beggar | ఈ బిచ్చగాడికి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు : ఇండోర్లో విస్తుపోయే నిజం
ఇందూర్ భిక్షాటన వ్యతిరేక కార్యక్రమంలో ఒక భిక్షకుడు మంగీలాల్ వద్ద మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఒక కారు, అలాగే బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భిక్షాటనతో పాటు వడ్డీ వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతున్న ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Indore Anti-Beggary Drive Reveals Crorepati Beggar Owning 3 Houses, Autos, and a Car
విధాత వైరల్ డెస్క్ | హైదరాబాద్:
Indore Beggar | మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లో అధికారులు నిర్వహిస్తున్న భిక్షాటన వ్యతిరేక కార్యక్రమంలో నివ్వెరపోయే ఘటన వెలుగుచూసింది. భిక్షాటన చేస్తూ రోజువారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని భావించిన ఒక కుష్టువ్యాధి బాధితుడి వద్ద మూడు ఇళ్లు, మూడు ఆటో రిక్షాలు, ఒక మారుతి డిజైర్ కారు, అలాగే బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. నగరాన్ని భిక్షాటన రహితంగా మార్చే ప్రక్రియలో ఈ ఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది.
యాంటీ–బెగ్గరీ డ్రైవ్లో వెలుగులోకి వచ్చిన వింతలు

ఇందూర్‌లోని సరాఫా బజార్ ప్రాంతంలో వీల్‌బోర్డుపై కూర్చుని భిక్షాటన చేస్తున్న వ్యక్తి గురించి సమాచారం రావడంతో శనివారం రాత్రి అధికారుల ప్రత్యేక బృందం అతన్ని పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లింది. విచారణలో అతని పేరు మంగీలాల్ (వయసు సుమారు 55–60) అనీ, కుష్టువ్యాధి కారణంగా శారీరక అంగవైకల్యం కలిగిన ఈ వ్యక్తి 2021 నుండి భిక్షాటన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే అతని వద్ద ఉన్న ఆస్తులే అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఆధికారిక వివరాల ప్రకారం మంగీలాల్ పేరుతో:
– మూడు ఇళ్లు, అందులో ఒకటి మూడంతస్తుల భవనం
– మూడు ఆటో రిక్షాలు (ప్రతిరోజూ అద్దెకు ఇస్తాడు)
– మారుతి డిజైర్ కారు (దీనికి డ్రైవర్ కూడా ఉన్నాడు) ఉన్నాయి.
అంతేకాకుండా, రోజువారీగా భిక్షాటన ద్వారా వచ్చే రూ.400–500 ఆదాయానికి తోడు, మంగీలాల్ సరాఫా బులియన్ మార్కెట్‌లో చిన్న వ్యాపారులకు అతను రూ.4–5 లక్షలు అప్పుగా ఇచ్చి, వాటిపై రోజూ వడ్డీగా రూ.1,000–1,200 వసూలు చేస్తున్నట్లు విచారణలో బయటపడింది.
అతను వికలాంగుడిగా PMAY పథకంలో 1BHK ఇల్లు కూడా పొందినట్లు శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతన్ని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించారు. సంబంధిత బ్యాంక్ ఖాతాలు, ఆస్తులు, పెట్టుబడులపై జిల్లా పరిపాలన మరింత సమాచారం సేకరిస్తోంది.
భిక్షాటన ఆపేందుకు ఏళ్లుగా ప్రయత్నం – అన్నీ విఫలం

ప్రవేశ్ అనే ఎన్‌జీఓ ప్రతినిధి రుపాలీ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, మంగీలాల్ గతంలో నిర్మాణ మేస్త్రీగా పనిచేసేవాడు. అయితే కుష్టువ్యాధి కారణంగా చేతులు, కాళ్లల్లో వైకల్యాలు ఏర్పడటంతో పని చేయలేకపోయాడు. కుటుంబ, సామాజిక వివక్ష కారణంగా 2021లో రాత్రివేళలలో సరాఫా ప్రాంతంలో భిక్షాటన ప్రారంభించాడు. ఎన్‌జీఓ ఆయనను రెండు సార్లు కౌన్సెలింగ్ చేసి భిక్షాటన మాన్పించాలని ప్రయత్నించినా, కొంతకాలం ఆపి మళ్లీ తిరిగి భిక్షాటనే కొనసాగించాడు.
రుపాలీ జైన్ మాట్లాడుతూ, “ఈ కేసును మానవతా దృక్పథంతో చూడాలి. సంపాదన మొత్తం భిక్షాటన వల్లనే వచ్చిందని అనుకోవడం సరైనది కాదు. అతని వ్యాధి, సామాజిక ఒత్తిడి కూడా ఈ పరిస్థితికి కారణం,” అని చెప్పారు.
ఇందూర్ జిల్లా పరిపాలన గత దశాబ్దంగా నగరాన్ని ‘భిక్షాటన రహిత నగరం’గా మార్చే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటి వరకు 6,500 బిచ్చగాళ్లలో 4,500 మంది కౌన్సెలింగ్ తర్వాత ఈ అలవాటు మానేసినట్లు, 1,600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram