Safety Pin | పిన్నీసును మింగిన 5 నెల‌ల బాలుడు.. 5 రోజుల పాటు న‌ర‌క‌యాత‌న‌

Safety Pin | పిన్నీసును మింగిన 5 నెల‌ల బాలుడు.. 5 రోజుల పాటు న‌ర‌క‌యాత‌న‌

Safety Pin | కోల్‌క‌తా : ఓ ఐదు నెల‌ల బాలుడు త‌న తోబుట్టువుల‌తో ఆడుకుంటూ పిన్నీసును మింగేశాడు. ఆ త‌ర్వాత ఐదు రోజుల పాటు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు తలెత్తి ఐదు రోజుల పాటు నర‌క‌యాత‌న అనుభ‌వించాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హుగ్లీలోని జంగీపారాకు చెందిన ఓ మ‌హిళ త‌న కుమారుడిని తోబుట్టువుల వ‌ద్ద ఉంచి త‌న ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఆ ఐదు నెల‌ల బాలుడు ఆడుకుంటూ.. ఓ పిన్నీసును మింగేశాడు. ఆ త‌ర్వాత శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా, శ్వాస తీసుకునేందుకు కావాల్సిన చికిత్స‌ను చేశాడు డాక్ట‌ర్.

కానీ బాలుడు ఏడుపు ఆప‌డం లేదు. ఏక‌బిగి ఏడుస్తున్న పిల్లాడిని తీసుకొని క‌ల‌క‌త్తా మెడిక‌ల్ కాలేజీకి వెళ్లారు. అక్క‌డ ఈఎన్టీ వైద్యులు.. బాలుడిని ప‌రీక్షించారు. డాక్ట‌ర్ సుదీప్ దాస్ ఎక్స్ రే తీయ‌గా, శ్వాస‌నాళంపై పిన్నీసు ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో బాలుడికి 40 నిమిషాల పాటు స‌ర్జ‌రీ నిర్వ‌హించి, పిన్నీసును విజ‌య‌వంతంగా తొల‌గించారు. ప్ర‌స్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడ‌ని, ఊపిరి తీసుకోవ‌డంలో ఎలాంటి ఇబ్బంది లేద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.