చిత్తుగా ఓడిన‌ డిఫెండింగ్ ఛాంపియన్.. ఇక ఇంటి బాట ప‌ట్టిన‌ట్టేనా..!

  • By: sn    breaking    Oct 27, 2023 12:06 AM IST
చిత్తుగా ఓడిన‌ డిఫెండింగ్ ఛాంపియన్.. ఇక ఇంటి బాట ప‌ట్టిన‌ట్టేనా..!

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లు కొన్ని రంజుగా మారుతున్నాయి. చిన్న టీంలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి.ఆఫ్ఘ‌నిస్తాన్, నెద‌ర్లాండ్స్ వంటి చిన్న టీమ్స్ పెద్ద టీమ్‌లపై మంచి విజ‌యాలు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇక తాజాగా శ్రీలంక‌.. ఇంగ్లండ్‌ని ఓడించి సెమీస్ బెర్త్ ద‌క్క‌కుండా చేసింది. శ్రీలంక‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలు కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ల్లో 4 ఓడిన ఇంగ్లండ్.. దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా కూడా ఆ జట్టు సెమీస్ చేరే పరిస్థితి అయితే లేదు.

టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దిగిన ఇంగ్లండ్ జ‌ట్టు ఇంత దారుణంగా విఫ‌లం అవుతుంద‌ని ఎవ‌రు భావించ‌లేదు. తాజాగా శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని విమ‌ర్శ‌ల పాల‌వుతుంది. లంకేయుల ధాటికి ఇంగ్లాండ్ 156 పరుగులకే కుప్పకూలగా.. స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 25.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక బౌలర్లు ప‌రుగులు రాకుండా చేశారు. ఈ క్ర‌మంలో ఇంగ్లీష్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ టీంలో బెన్ స్టోక్స్ (43), జానీ బెయిర్‌స్టో (30), డేవిడ్ మలన్ (28)లు ధాటిగా ఆడడానికి ప్ర‌య‌త్నించిన కూడా ప‌రుగులు రాలేక‌పోయాయి.

ఇంగ్లండ్ కీలక ఆటగాళ్లైన జోరూట్ (3), జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్ స్టోన్ (1), మొయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (0), ఆదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14)లు ఈ మ్యాచ్‌లో దారుణంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఇంగ్లండ్‌కి ప‌రుగులు రావ‌డం క‌ష్టంగా మారింది. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2, మహీశ్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు. అయితే త‌క్కువ స్కోర్ టార్గెట్ ఉండ‌డంతో లంక బ్యాట్స్‌మెన్స్ య‌దేచ్చ‌గా ఆడారు. శ్రీలంక కేవ‌లం 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాట‌డంతో సునాయాసంగా విజ‌యం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(2/30) రెండేసి వికెట్లు తీసిన ఉప‌యోగం లేకుండా పోయింది. ఈ ఓట‌మితో ఇంగ్లండ్ జ‌ట్టు సెమీస్ దారుల‌న్నీ మూసుకుపోయిన‌ట్టే..