IPL 2024 | ఆకాశమే హద్దుగా SRH బ్యాటర్స్‌ విశ్వరూపం.. ఐపీఎల్‌ చరిత్రలోనే హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోర్‌ నమోదు

IPL 2024 | ఆకాశమే హద్దుగా SRH బ్యాటర్స్‌ విశ్వరూపం..  ఐపీఎల్‌ చరిత్రలోనే హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోర్‌ నమోదు

IPL 2024 : ఐపీఎల్ సీజన్‌ 17లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన SRH బ్యాటర్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఎయిడెన్ మార్క్రమ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో SRH టీమ్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.


దాంతో ఐపీఎల్‌ చరిత్రలోనే హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా SRH అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) పేరు మీద ఉన్న రికార్డును SRH బద్దలు కొట్టింది. 2013లో RCB సాధించిన 263 పరుగులే ఇప్పటిదాకా ఐపీఎల్‌ చరిత్రలో హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోరుగా ఉన్నది. ఇవాళ్టి SRH ఇన్నింగ్స్‌లో ట్రావిస్‌ హెడ్‌ (62), అభిషేక్‌ శర్మ (63), హెన్రిచ్‌ క్లాసెన్‌ (80), ఎయిడెన్ మార్క్రమ్‌ (42) అద్భుతంగా రాణించారు. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు అర్ధసెంచరీలు నమోదయ్యాయి. కేవలం మయాంక అగర్వాల్‌ (11) మాత్రమే తక్కువ స్కోర్‌కు వెనుదిరిగాడు.  


ఈ సీజన్‌లో ఇది 8వ ఐపీఎల్‌ మ్యాచ్‌. ఇప్పటి వరకు రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ ఆడాయి. అదేవిధంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాయి. SRH జట్టు తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) చేతిలో ఓడిపోగా, ముంబై ఇండియన్స్‌ (MI) జట్టు గుజరాత్ టైటాన్స్‌ (GT) చేతిలో ఓటమి పాలైంది.