సెమీ ఫైనల్ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించిన హాట్ స్టార్..గత రికార్డ్ బ్రేక్..!

వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ బెర్త్ ఇండియా కైవసం చేసుకోగా, ఆ టీంతో ఎవరు తలపడనున్నారనే దానిపై నేటితో క్లారిటీ వస్తుంది. అయితే సెమీఫైనల్స్ లో భాగంగా వాంఖడే వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కి భారీ ఆదరణ లభించింది. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోగా, టీవీలలో, హాట్ స్టార్‌లలో వీక్షకులు ఎగబడి చూశారు. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీహాట్ స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి సెమీఫైనల్లో హాట్‌స్టార్ రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ మ్యాచ్ ను హాట్ స్టార్‌లో 5.1 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించడంతో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యింది.
కొన్ని రోజుల కిందట ధర్మశాల వేదికగా ఇండియా-కివీస్ మ్యాచ్ జరగగా,ఆ మ్యాచ్‌ని గరిష్టంగా 4.30 కోట్ల మంది వీక్షించారు. ఈ రికార్డు తాజాగా బద్దలైంది. విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేయడం హాట్ స్టార్‌కు బాగానే కలిసి వచ్చింది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ 50వ సెంచరీ పూర్తయిన క్షణాన హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరడంతో సరికొత్త రికార్డ్ నమోదు అయినట్టు అయింది. సెంచరీ పూర్తయ్యాక కోహ్లీ మొకరిల్లి సచిన్‌కి అభివాదం చేయడం, తన సతీమణి అనుష్క వైపు చూస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరింది. ఈ మ్యాచ్‌లో వ్యూస్ 4 కోట్లకి ఏ మాత్రం తగ్గలేదు. ఇదే వన్డే ప్రపంచకప్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో గరిష్టంగా 4.4 కోట్ల రియల్ టైమ్ వ్యూస్ రాగా, దానిని సెమీస్ మ్యాచ్ బ్రేక్ చేసింది.
ఇక సెమీ ఫైనల్‌లో భారత్ సమిష్టిగా రాణించడంతో 70 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.ఏడు వికెట్లతో చెలరేగిన(7/57) మహమ్మద్ షమీ న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ శతకాలు బాదడంతో పాటు మొదట్లో రోహిత్ శర్మ, చివరలో కేఎల్ రాహుల్ విజృంభించడంతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.