IND vs NZ 5th T20I | ఆఖరి టి20లో భారత్ అద్భుత విజయం – ఇషాన్ శతక తాండవం : సిరీస్ 4–1తో కైవసం
ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, అర్షదీప్ అయిదు వికెట్ల సంచలనంతో భారత్ ఐదో టీ20లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. 271 పరుగులు చేసి కివీస్‌ను 225కే ఆలౌట్ చేసి సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది.
Ishan Kishan Century, Arshdeep Five-For Power India to Series Win vs New Zealand
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
IND vs NZ 5th T20I | న్యూజిలాండ్‌తో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4–1తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఇషాన్ కిషన్(103 పరుగులు), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(242 పరుగులు) అవార్డులు గెలుచుకున్నారు.
అయిదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించిన అర్షదీప్

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం కొంతమేర అనుకూలంగా కనిపించింది. ఫిన్ అలెన్ (80), రచిన్ రవీంద్ర (30) జోరుగా ఆడుతూ రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, భారీ టార్గెట్ ఒత్తిడిలో వికెట్లు వరుసగా పడిపోయాయి.
ఇష్ సోధీ (33), డారెల్ మిచెల్ (26) తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కివీస్ తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను శాసించాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ ఒక్కో వికెట్ సాధించారు.
సూర్య, హార్థిక్లు తోడుగా.. ఇషాన్ విధ్వంసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలో పెద్దగా శుభారంభం దక్కలేదు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. తన తొలి అంతర్జాతీయ టి20 శతకంతో ప్రపంచకప్ ముందు టీమ్ మేనేజ్మెంట్కు ఘనమైన సందేశాన్ని పంపాడు.
ఇష్ సోధీ ఓవర్‌లో వరుసగా బౌండరీలు, సిక్సర్లతో 29 పరుగులు రాబట్టిన కిషన్ మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేసి తన 360 డిగ్రీల ఆటను మరోసారి చూపించాడు. హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులతో చివరి ఓవర్లలో పరుగుల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ 30 పరుగులతో చక్కని సహకారం అందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 23 సిక్స్‌లు బాదటం విశేషం. ఫోర్ల కంటే సిక్స్‌లే ఎక్కువగా ఉండటం టీమిండియా దాడి స్థాయిని స్పష్టంగా చూపించింది. ఈ సిరీస్‌లో మొత్తం భారత్ 69 సిక్స్‌లు బాదడం మరో రికార్డు.
సంజూ నిరాశ.. వరల్డ్‌కప్ రేసులో ఇషాన్ ముందంజ
ఈ సిరీస్‌లో కీలకంగా భావించిన సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. స్వంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. సిరీస్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, వరల్డ్‌కప్ జట్టు ఎంపికలో ఇషాన్ కిషన్‌కు పైచేయి దక్కే అవకాశాలు మరింత పెరిగాయి.
ఇషాన్, సూర్య మూడో వికెట్‌కు 57 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించారు. సెంచరీ అనంతరం ఇషాన్ ఔటైనా, హార్దిక్ బ్యాటింగ్‌తో పరుగుల వేగం ఏమాత్రం తగ్గలేదు. శివమ్ దూమే చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఇన్నింగ్స్‌కు ఘన ముగింపు పలికాడు.
ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, అర్షదీప్ 5 వికెట్ల అద్భుత బౌలింగ్‌తో టీమిండియా ప్రపంచకప్ ముందు తన బలాన్ని స్పష్టంగా చాటింది. సిరీస్ విజయం భారత జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram