Rajasekhar | హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా.. కోట్లు సంపాదిస్తున్నారంటూ వార్త‌లు..

Rajasekhar | సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నిజమైన వార్తలకంటే తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల పేర్లను ఉపయోగించి కొంతమంది ఆకతాయిలు సృష్టిస్తున్న ఫేక్ వార్తలు నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నాయి. తాజాగా హీరో రాజశేఖర్ పేరు మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 14, 2026 4:34 PM IST
Rajasekhar | హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా.. కోట్లు సంపాదిస్తున్నారంటూ వార్త‌లు..

Rajasekhar | సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నిజమైన వార్తలకంటే తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల పేర్లను ఉపయోగించి కొంతమంది ఆకతాయిలు సృష్టిస్తున్న ఫేక్ వార్తలు నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నాయి. తాజాగా హీరో రాజశేఖర్ పేరు మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంతకాలంగా హీరో రాజశేఖర్ గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ ప్రారంభించారని, అందులో లక్షలాదిమందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని, ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని కొన్ని పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయనకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని కూడా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాన్ని మరింత నమ్మేలా కొంతమంది ఏఐ క్రియేటర్లు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా కనిపించే వీడియోలను కూడా రూపొందించారు. దీంతో చాలామంది అసలు విషయం తెలుసుకోవడానికి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, అభిమానులు రాజశేఖర్‌కు ఫోన్ చేసి అడిగారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ ఈ పుకార్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ‘బైకర్’ అనే సినిమాలో నటిస్తున్న ఆయన, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

నాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని, ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నానని వైరల్ అవుతున్న వీడియోలు చూసి నా సన్నిహితులు నాకు ఫోన్ చేశారు. అప్పుడే ఈ విషయం నాకు తెలిసింది. ఇందులో అసలు నిజం లేదు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని రాజశేఖర్ తెలిపారు. ఇదే విషయంపై ఆయన భార్య జీవిత రాజశేఖర్ కూడా స్పందించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. మాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని వస్తున్న వార్తలు విని నేను, మా ఆయన రాజశేఖర్, మా పిల్లలు అందరం నవ్వుకున్నాం. కానీ మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి కొంతమంది యువత నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి బాధగా ఉంది అని ఆమె అన్నారు.

అలాంటి మోసాలకు యువత బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని, అధికారిక సమాచారం లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని రాజశేఖర్ దంపతులు హెచ్చరించారు.