వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్.. డబుల్ సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం

టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులకి మంచి మజాని అందించడం ఖాయం. భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ జరగగా, ఈ మూడు టీ20లలో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జనవరి 17న జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. పవర్ ప్లేలో భారత్ జట్టు వరుస వికెట్స్ కోల్పోతున్నా కూడా రోహిత్ శర్మ మాత్రం చివరి వరకు నిలిచి భారత్ స్కోరు 200 మార్కు దాటేలా చేవాడు. మూడో టీ20లో రోహిత్ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అరుదైన రికార్డు నమోదు చేశాడు.
ఇక రోహిత్ శర్మకి తోడుగ నిలిచిన రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్స కోల్పోయి 212 పరుగులు చేసింది. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్ చేసి ఆదుకోవడంతో ఆ స్కోర్ వచ్చింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు. ఇక లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆఫ్ఘన్ జట్టు కూడా 20 ఓవర్లకి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/18) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
india-beat-afghanistan-after-2nd-super-overఅయితే స్కోర్స్ టై కావడంతో సూపర్ ఓవర్ ఆడారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు ఆరు బంతులకి గాను 16 పరుగులు రాబట్టింది. ఇక 17 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగగా వారు కేవలం 16 పరుగులు మాత్రమే చేశారు. దీంతో స్కోర్స్ మళ్లీ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో తొలుత భారత్ బ్యాటింగ్ చేయగా, కేవలం 11 పరుగులు మాత్రమే చేశారు.ఈ 11 పరుగులను డిఫెండ్ చేసేందుకు రవి బిష్ణోయ్ ని భారత్ రంగంలోకి దింపింది.. అఫ్గాన్ తరఫున నబీ, గుర్జాజ్ బ్యాటింగ్ చేశారు. తొలి బంతికి నబీ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, ఆ తర్వాత గుర్బాజ్ క్యాచ్ ఔట్ కావడంతో భారత విజయం లాంఛనమైంది.