అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థిపై దాడి..

అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థిపై దాడి జ‌రిగింది. గుర్తు తెలియ‌ని ముగ్గురు వ్య‌క్తులు అత‌నిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థిపై దాడి..

హైద‌రాబాద్ : అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థిపై దాడి జ‌రిగింది. గుర్తు తెలియ‌ని ముగ్గురు వ్య‌క్తులు అత‌నిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. త‌ల‌, ముక్కు, క‌ళ్ల‌పై గాయాలయ్యాయి. ముక్కులో నుంచి ర‌క్తం కారుతుండ‌గా బాధితుడు మాట్లాడిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

బాధిత విద్యార్థిని లంగ‌ర్‌హౌజ్ హ‌షీమ్‌న‌గ‌ర్‌కు చెందిన స‌య్య‌ద్ మ‌జాహిర్ అలీగా గుర్తించారు. ఐటీలో మాస్ట‌ర్స్ చేసేందుకు కొన్ని నెల‌ల క్రిత‌మే అలీ అమెరికాలో వెళ్లాడు. అమెరికాలోని ఇండియానా వెస్ల‌య‌న్ యూనివ‌ర్సిటీలో అడ్మిష‌న్ తీసుకున్నాడు.

అయితే ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన అలీ హోట‌ల్ నుంచి చికాగోలోని కాంప్‌బెల్‌లోని త‌న గ‌దికి తిరిగి వ‌స్తుండ‌గా, ముగ్గురు దుండగులు వెంబ‌డించారు. ఇంటికి స‌మీపంలో అలీని ప‌ట్టుకున్న దుండ‌గులు దాడి చేసి పారిపోయారు. ప్లీజ్ హెల్ప్.. అని అరిచినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని అలీ వాపోయాడు. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్న అలీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

అలీ భార్య స‌యేదా ఫాతిమా రిజ్వి మాట్లాడుతూ.. త‌న భ‌ర్త‌పై దాడి ఘ‌ట‌న‌ను కేంద్ర‌ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాల‌ని కోరిన‌ట్లు పేర్కొన్నారు. త‌న భ‌ర్త భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న ఉంద‌న్నారు. వీలైతే త‌న‌ను చికాగో పంపేందుకు కేంద్ర చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. త‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని, వారిని కూడా తీసుకెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఫాతిమా కేంద్రాన్ని కోరారు.