NEOM Sky Stadium : వరల్డ్ వండర్…సౌదీ అరేబియా స్కై స్టేడియం

సౌదీ అరేబియాలో 2034 ప్రపంచ కప్ కోసం 350 మీటర్ల (1,150 అడుగులు) ఎత్తులో 'నియోమ్ (NEOM) స్కై స్టేడియం' నిర్మాణమవుతోంది. 46,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం, ప్రపంచ అద్భుత నిర్మాణంగా రూపుదిద్దుకుంటోంది.

NEOM Sky Stadium : వరల్డ్ వండర్…సౌదీ అరేబియా స్కై స్టేడియం

విధాత, హైదరాబాద్ : సౌదీ అరేబియాలో జరిగే 2034 ప్రపంచ కప్ కోసం నిర్మిస్తున్న నియోమ్(NEOM) స్టేడియం ప్రపంచ అద్బుత నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది. భూమి నుండి 350(1,150 అడుగులు) మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న స్కై స్టేడియంలోకి చేరుకునేందుకు ఒకేసారి 60,000 మంది లిఫ్ట్‌లను ఉపయోగించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టేడియంలో 46వేల మంది కూర్చుని మ్యాచ్ ను చూడవచ్చు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి..భవిష్యత్తు పోటీలకు అనుగుణంగా ప్రత్యేకమైన నిర్మాణ, ఇంజనీరింగ్ విధానంతో స్కై స్టేడియం నిర్మాణం చేస్తున్నారు. ది లైన్‌ సిటీకి ఈ స్టేడియం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్టేడియం నిర్మాణం 2027లో ప్రారంభమై 2032లో ముగియనుందని సౌదీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. గ్రూప్ దశ నుండి క్వార్టర్ ఫైనల్స్ వరకు మ్యాచ్‌లకు నియోమ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమవుతోంది.

అన్ని అధునాతన స్టేడియాలే

2034 ఫిఫా ప్రపంచ కప్ కోసం సౌదీ అరేబియా నిర్మిస్తున్న ఎనిమిది కొత్త వేదికలలో నియోమ్ స్టేడియం ఒకటి. మొత్తం 15 అధునాతన స్టేడియాలను ఆ దేశం సిద్దం చేస్తుంది. రియాద్, జెడ్డా, అల్ ఖోబార్, అభా, నియోమ్ స్టేడియంలు ప్రముఖమైనవి. 48 జట్లతో కూడిన 100కుపైగా మ్యాచ్ లతో జరిగే ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులతో..ప్రేక్షకుల సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్డేడియాలను నిర్మిస్తున్నారు.

నియోమ్ స్టేడియం మరికొన్ని ప్రత్యేకతలు

నియోమ్ స్టేడియం యొక్క బాహ్య భాగంలో అద్దాల ఉపరితలాలు, ఎల్ ఈడీలు ఉంటాయి. లోపలి భాగం దృశ్యం, ధ్వని శాస్త్రం ఆధారంగా కాంపాక్ట్ సీటింగ్ బౌల్ కాన్ఫిగరేషన్‌తో నిర్మిస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రాన్సిట్ సిస్టమ్స్ స్టేడియంకు అదనపు ఆకర్షణలను అందిస్తాయి. ఈ-టికెట్ గేట్లు, 4K అల్ట్రా HD ప్రసారాలు ఉంటాయి. నియోమ్ స్టేడియం పూర్తిగా పవన, సౌర వనరుల నుండి పునరుత్పాదక శక్తిపై నడుస్తుంది. రవాణా వ్యవస్థలు పూర్తిగా విద్యుత్తుతో ఉంటాయి, నియోమ్‌ స్టేడియంలో క్రీడా పోటీల నిర్వహణతో పాటు శిక్షణా సౌకర్యాలు, వసతి, రిటైల్ అవుట్‌లెట్‌లు, వినోద స్థలాలను కలిగి ఉన్న పెద్ద క్రీడా నిర్వహణ కేంద్రంగా ఉండబోతుంది. ఫుట్ బాల్ ప్రపంచ కప్ తర్వాత, ఈ వేదిక క్రీడలు, వినోద కార్యక్రమాలకు శాశ్వత కేంద్రంగా ఉపయోగపడేలా ప్రణాళికలు వేశారు.

వేలాది మంది కార్మికులు స్టేడియాలు, హోటల్స్ నిర్మాణాలలో పనిచేస్తున్నారు. ఎక్కువగా దక్షిణాసియా నుండి వచ్చిన తక్కువ వేతన వలస కార్మికులు వాటిలో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు సంక్షేమం, హక్కులపై ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Akira Nandan | ఏఐతో అకిరా హీరోగా సినిమా… పవన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ గెస్ట్ పాత్ర‌ల్లో..!
Telangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో