ఐపీఎల్ 2024 మ్యాచ్‌లపై ఎన్నికల ప్రభావం ప‌డ‌నుందా.. సెకండాఫ్ విదేశాల‌లో నిర్వ‌హించ‌నున్నారా.. క్లారిటీ ఇదే!

ఐపీఎల్ 2024 మ్యాచ్‌లపై ఎన్నికల ప్రభావం ప‌డ‌నుందా.. సెకండాఫ్ విదేశాల‌లో నిర్వ‌హించ‌నున్నారా.. క్లారిటీ ఇదే!

మార్చి 16న ఎల‌క్ష‌న్ క‌మీన్ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే మ‌రో వారం రోజుల‌లో ఐపీఎల్ ప్రారంభం కానుండ‌గా, ఈ స‌మ‌యంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావ‌డంతో ఐపీఎల్ మ్యాచ్‌లపై ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయ‌నేది హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొద్ది రోజులుగా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లు యూఏఈకు బదిలీ కానున్నాయని చర్చ న‌డుస్తుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందో తెలియక బీసీసీఐ తొలి విడత షెడ్యూల్ మాత్రమే విడుదల చేయ‌డం మ‌నం చూశాం. ఈ సీజ‌న్ రెండు విడత‌లుగా జ‌ర‌నుండ‌గా, తొలి విడత షెడ్యూల్ మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ ఉంటుంది అని తెలియ‌జేశారు.

రెండో విడ‌త షెడ్యూల్‌పై ఇంకా స‌స్పెన్స్ నెలకొని ఉంది. ఏప్రిల్, మే రెండు నెలల్లోనూ దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అని అంద‌రు టెన్ష‌న్‌లో ఉన్నారు. గతంలో 2009, 2014 ఎన్నికల సమయంలో ఐపీఎల్ టోర్నీని దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో బీసీసీఐ నిర్వ‌హించిన విషయం మ‌న‌కు తెలిసిందే. అయితే 2019లో మాత్రం ఇండియాలోనే ఐపీఎల్ నిర్వ‌హించారు. కాని ఈసారి రెండో విడత మ్యాచ్‌లు యూఏఈలో జరగవచ్చంటూ జోరుగా ప్ర‌చారాలు సాగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు.

రెండో దశ మ్యాచ్‌‌లు యూఏఈకు బదిలీ కానున్నాయని వస్తున్న వార్త‌లు ఉట్టి పుకార్లేన‌ని అందులో నిజం లేద‌ని వారు అన్నారు. వీలైనంత త్వ‌ర‌లోనే రెండో విడత షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని స్ప‌ష్టం చేశారు. ఈ సారి ఐపీఎల్ సీజన్ మొత్తం ఇండియాలోనే జరుగుతుందని, విదేశాల్లో నిర్వహించే ఆలోచన మేము చేయ‌డం లేద‌ని కూడా జైషా పేర్కొన్నారు. రెండో ద‌శ మ్యాచ్‌లు కూడా ఇండియాలోనే ఉంటాయ‌ని అన్నారు. కాగా, మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ ఐపీఎల్ 2024 సీజన్ 17 తొలి విడత జరగనుండ‌గా, రెండో విడత షెడ్యూల్ వీలైనంత త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తార‌ని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే జూన్ 1 నుంచే అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 మొద‌లు కానున్న నేప‌థ్యంలో ..మే చివరి వారానికి ముందే ఐపీఎల్‌ను ముగించాల్సి ఉంది.