ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం..చ‌రిత్ర సృష్టించిన క్యాపిటల్స్ జ‌ట్టు

ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం..చ‌రిత్ర సృష్టించిన క్యాపిటల్స్ జ‌ట్టు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌య యాత్ర అప్ర‌తిహ‌తంగా సాగుతుంది. వ‌రుస విజ‌యాల‌తో టేబుల్ టాప్‌లోకి దూసుకుపోతుంది. మంగ‌ళ‌వారం ఈ జ‌ట్టు ముంబై ఇండియన్స్‌తో పోటీ ప‌డ‌గా, ఈ మ్యాచ్‌లో 29 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయ‌గా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 నాటౌట్), మెగ్ లాన్నింగ్(38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించ‌డంతో ఢిల్లీ జ‌ట్టు భారీ స్కోరు సాధించింది.

ఇక భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవ‌లం 163 పరుగులే మాత్ర‌మే చేసి ఓట‌మి చ‌వి చూసింది. భారీ ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ్యాట‌ర్లు ముందు నుండే హిట్టింగ్ చేయ‌డంతో త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్స్ కోల్పోవ‌లసి వ‌చ్చింది. అయితే అమన్‌జోత్ కౌర్(27 బంతుల్లో 7 ఫోర్లతో 42), హీలీ మాథ్యూస్(17 బంతుల్లో 6 ఫోర్లతో 29) మోస్తరు స్కోరు చేయ‌డంతో ముంబై జ‌ట్టు కనీసం 163 ప‌రుగులు అయిన చేయ‌గ‌లిగింది. యస్తికా భాటియా(6), నాట్ సివర్ బ్రంట్(5), హర్మన్‌ప్రీత్ కౌర్(6) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు.ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్(3/21) మూడు వికెట్లు తీయగా.. మరిజన్నే కాప్(2/37) రెండు వికెట్లు , శిఖా పాండే, టిటాస్ సధు, రాధా యాదవ్ తలో వికెట్ తీసి ముంబై ఇండియ‌న్స్ ప‌త‌నాన్ని శాసించారు.

ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో విజ‌యం సాధించ‌గా, ముంబైకి రెండో ప‌రాజ‌యం. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.కొద్ది రోజుల క్రితం ఇదే ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్లతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత సంచలన ప్రదర్శన చేస్తూ వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు న‌మోదు చేసి టేబుల్ లో మొద‌టి స్థానానికి చేరింది. యూపీ వారియర్స్‌ను 9 వికెట్లతో ఓడించిన ఢిల్లీ.. ఆ త‌ర్వాత ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. ఇక తాజా మ్యాచ్‌లో 29 పరుగులతో ముంబైని ఓడించి టాప్‌కి వెళ్లింది. మ‌రి రానున్న రోజుల‌లో వారి ప్రద‌ర్శ‌న ఎలా ఉంటుందో చూడాలి.