IPL2024 LSGvs DC | లక్నో పరాజయం– టోర్నీ నుండి ఔట్

యజమాని గోయోంకా (Sanjiv Goenka)ఊరడింపు పనికిరాలేదు. లక్నో సూపర్ జెయింట్స్(Luknow Super Giants) ఢిల్లీ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ(Delhi Capitals) కూడా నిజానికి టోర్నీ నుండి వైదొలిగినట్లే. కేవలం లెక్కల్లో మాత్రమే ఢిల్లీ ఇంకా ఊగిసలాడుతోంది.

  • By: Tech    sports    May 15, 2024 12:23 AM IST
IPL2024 LSGvs DC | లక్నో పరాజయం– టోర్నీ నుండి ఔట్

• విజయం సాధించిన ఢిల్లీ కూడా దాదాపు ఔటే.!
యజమాని గోయోంకా (Sanjiv Goenka)ఊరడింపు పనికిరాలేదు. లక్నో సూపర్ జెయింట్స్(Luknow Super Giants) ఢిల్లీ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ(Delhi Capitals) కూడా నిజానికి టోర్నీ నుండి వైదొలిగినట్లే. కేవలం లెక్కల్లో మాత్రమే ఢిల్లీ ఇంకా ఊగిసలాడుతోంది.

ఐపిఎల్ 2024లో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 19 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 12 పాయింట్లు, –0.787 రన్రేట్తో మిగిలిన లక్నో అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒక మ్యాచ్ ఇంకా ఉన్నా, ఏదో అద్భుతం జరిగి, ముంబయిపై భారీ తేడాతో గెలిచి, హైదరాబాద్, చెన్నై జట్లలో ఏదో ఒకటి ఓడిపోతే, అప్పుడు ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. దాదాపు అది అసాధ్యం కాబట్టి, లక్నో ప్రయాణం ముగిసినట్లే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. 14 మ్యాచ్ల లీగ్ ప్రయాణాన్ని విజయంతో ముగించిన ఢిల్లీ 14 పాయింట్లు, –0.377 నెట్ రన్రేట్తో దాదాపు ఇంటికెళ్లిపోయినట్లే. ఇప్పుడు సాంకేతికంగా ఈ రెండు జట్ల ప్లేఆఫ్స్ ఆశలు మిగిలిన మూడు జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా అది దాదాపు అసంభవం.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు తొలి ఓవర్లోనే బంపర్ ఆఫర్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ ఫ్రేజర్ మెక్గర్క్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. తమ నిర్ణయం సరైందేనన్న సంతోషం లక్నోకు ఎక్కువసేపు నిలువలేదు. మరో ఓపెనర్ అభిషేక్ పొరెల్(58)తో జతకలిసిన షాయ్ హోప్(38) స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 92 పరుగులు జోడించారు. హోప్ ఔటయిన తర్వాత పొరెల్, కెప్టెన్ పంత్(33)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసాడు కానీ, ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అప్పుడొచ్చిన స్టబ్స్(57) కెప్టెన్తో జతకలిసి మెరుపుదాడి చేసాడు. దాంతో ఢిల్లీ 208 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.

అనంతరం చేజింగ్కు దిగిన లక్నోకు మంచి ఆరంభం దక్కలేదు. జట్టు 7 పరుగుల వద్ద ఉన్నప్పుడే కెప్టెన్ రాహుల్(5)ను కోల్పోయిన లక్నో 24పరుగుల వద్ద మరో ఓపెనర్ డికాక్(12)నూ నష్టపోయింది. అప్పుడు పడింది అసలు దెబ్బ. వన్డౌన్లో వచ్చిన డాషింగ్ బ్యాటర్ స్టొయినిస్(5)ను అక్షర్పటేల్ స్టంపౌట్ చేయగా, కాసేపటికి దీపక్ హుడా(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇలా క్రమం తప్పకుండా వికెట్లు జారవిడుచుకున్న లక్నోను నికొలస్ పూరన్(61), అర్షద్ఖాన్(58) ఆదుకున్నారు. కానీ కీలక సమయంలో వీరిద్దరూ ఔటవడంతో లక్నో పరాజయం పాలు కాక తప్పలేదు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ బంతితో లక్నో బౌలర్లను ఇబ్బంది పెట్టి 3 వికెట్లు తీసుకున్నాడు.