Karnataka Bandh | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో కొనసాగుతోన్న బంద్.. 44 విమానాలు రద్దు

Karnataka Bandh | కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ, కన్నడ, రైతు సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కర్ణాటక వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, హోటల్స్ మూసివేశారు. ఆటోలు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 22 విమానాలు, అక్కడకు రావాల్సిన మరో 22 విమానాలు రద్దు అయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో విమానాలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
బంద్ నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచే రైతులు, ప్రజలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలకు చెందిన 50 మంది నేతలు నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్‌లో బస్టాండ్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. చిక్కమంగళూరులో ఆందోళనకారులు పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చి మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంద్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు పోలీసులు. సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కట్టడాలు, కేఆర్ఎస్ ఆనకట్ట, పర్యాటక, చారిత్రాక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఇక తమిళనాడుకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా తమిళనాడు వెళ్లే ఆర్టీసీ బస్సులను గురువారం అర్ధరాత్రి నుంచే నిలిపివేశారు.
కావేరి జలాల విడుదలను వ్యతిరేకిస్తూ గత మంగళవారం బెంగళూరులో బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తాజా బంద్ నేపథ్యంలో మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు, వ్యాపారులు పేర్కొన్నారు.
#WATCH | Pro-Kannada outfits in Karnataka’s Hubballi stage protest over the Cauvery water release to Tamil Nadu. pic.twitter.com/V8nLFNzg47
— ANI (@ANI) September 29, 2023