శనివారం మ్యాచ్ హైలైట్స్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఎస్ఆర్‌హెచ్..రీఎంట్రీ మ్యాచ్‌లో పంత్‌కి నిరాశ

ఈ సారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. చివరి వరకు విజయం ఎవరిని వరిస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. శనివారం రోజు రెండు మ్యాచ్‌లు జరగగా, ముందు ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య హోరాహోరి పోరు జరిగింది.దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌నితొలి మ్యాచ్‌తోనే ఓటమి పలకరించంది. పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం చవి చూసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించడంతో పంజాబ్ కింగ్స్ నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
ఇక మరో మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్, కోల్‌కతా మధ్య జరిగింది. చాలా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయలేక ఓటమి చెందింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 8 సిక్స్‌లతో 63) అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ జట్టుని విజయం వరించలేకపోయింది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా మొదట్లోనే వికెట్లన్ని వెంటవెంటనే కోల్పోయింది. అయతే చివర్లో రస్సెల్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, 3 బౌండరీలతో 64 పరుగులు రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఫిలిఫ్ సాల్ట్ (40 బంతుల్లో 53, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) , రమణ్ దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) కాస్త రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
ఇక 209 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌కి ఆరంభంలో బాగానే పరుగులు వచ్చాయి. మయాంక్ అగర్వాల్, అభిషేక్ ఉపాధ్యాయ్ పవర్‌ప్లేలోనే 60 పరుగులు చేసి టీంకి మంచి ఆరంభం అందించారు. అయితే వారు ఔటైన తర్వాత పరుగుల వేగం తగ్గింది. చివర్లో వచ్చిన క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ తీసుకొచ్చినా తన జట్టుని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్ తొలి బంతికి క్లాసెన్ సిక్స్ బాదగా.. మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక మరుసటి బంతి సింగిల్ రాగా.. ఐదో బంతికి క్లాసెన్ క్యాచ్ ఔట్ కావడంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆ బాల్‌కి పరుగులు రాకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.