దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ

దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ...లొంగుబాటు వెనుక రాజకీయ లక్ష్యం బహిరంగ కార్యకలాపాలకు శ్రీకారం ముందస్తు అనుమతి కోసం ప్రయత్నం కేంద్రం సహకరిస్తే ప్రకటనే తరువాయి

  • By: Tech |    telangana |    Published on : Mar 01, 2026 8:59 AM IST
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ

దేవ్ జీ నేతృత్వంలో సరికొత్త ప్రయోగం!
లొంగిపోయిన నేతలతో రాజకీయపార్టీ
తెలంగాణ నేల మీదుగా సన్నాహాలు
లొంగుబాటు వెనుక రాజకీయ లక్ష్యం
బహిరంగ కార్యకలాపాలకు శ్రీకారం
ముందస్తు అనుమతి కోసం ప్రయత్నం
కేంద్రం సహకరిస్తే ప్రకటనే తరువాయి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

నాలుగున్నర దశాబ్దాల మావోయిస్టుపార్టీ ఆచరణ నుంచి గుణపాఠం తీసుకుని మరో కొత్త ప్రయోగానికి తాజాగా లొంగిపోయిన ఆ పార్టీ అగ్రనేతలు దేవ్జీ, సంగ్రామ్ తదితరులు ప్రయత్నిస్తున్నారా? అనేక ప్రయోగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తెలంగాణ నేల ఈ ప్రయోగానికి సరికొత్త ప్రయోగానికి కూడా ప్రయోగశాలగా మారనున్నదా? అనేక ఎత్తుపల్లాలకు భూమికగా నిలిచిన ఈ గడ్డ పై నుంచి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయా? గత్యంతరం కూడా లేని పరిస్థితుల్లో ఉన్న పరిమితులు, పరిధిలో ఈ రాజకీయ లక్ష్యం నిర్ధేశించుకున్న తర్వాతనే మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు లొంగిపోయారా? లొంగుబాటు అనేది అనివార్యమైందే కాకుండా తాము ఇంత కాలం నమ్మి ఆచరించిన ప్రజాసైన్యం,గెరిల్లా పోరాటం ప్రతికూల ఫలితాలిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ఎంచుకున్నారా? దశాబ్దాలుగా తాము నమ్మిన రాజకీయాలను బహిరంగ, చట్టబద్ద, రాజ్యాంగ చట్రంలో ఆచరించేందుకు ప్రయత్నించాలని, తమ అనుభవాల నుంచి కొత్త ప్రయోగం చేయాలని భావిస్తున్నారా?
దాదాపు జీవితాంతం ప్రజల కోసం పనిచేసి ఏదో పాలకవర్గ పార్టీల్లో చేరడం కంటే ప్రజాస్వామిక పద్ధతుల్లో జీవితాలను కొనసాగించేందుకు తమ అనుభవాలను క్రోడికరించి కొత్త నిర్మాణ ప్రయత్నం చేయాలని యోచిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు నిజమేననే దిశగా సాగుతున్నాయి. ఈ ప్రయోగం ఫలిస్తుందా? లేదా? ఎంత మేరకు లక్ష్యసాధన దిశగా పయనిస్తారు అనే అంశాలను పక్కనపెడితే ప్రయత్నం మాత్రం సాగుతోందని పరిస్థితులు రుజువుచేస్తున్నాయి. ఇదిలా ఉండగా లొంగిపోయిన వారిపై ఉండే సహజమైన ప్రతికూల విమర్శలను పక్కన పెడితే, ఈ నేతలకు ఉన్న ప్రత్యాయమ్నాయాల్లో ఇదే అనువైందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు లొంగుబాటుకు ముందే ఒక విధమైన చర్చ ‘ఘర్షణ’ పడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారా? అనే అభిప్రాయాలు కూడా కొందరిలో వ్యక్తమవుతున్నాయి.

నేతల ప్రకటనల ఉద్ధేశ్యమిదేనా?

స్పష్టమైన ఆలోచనలతో లొంగుబాటు సందర్భంగా దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు చేసిన ప్రకటన ఉద్ధేశ్యమిదే? అనే చర్చ సాగుతోంది. తాము రాజకీయాల్లో కొనసాగుతామంటూ, అది కూడా ప్రజలు, ప్రజాస్వామిక అంశాల ప్రతిపాదిక అంటూ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఇంతకాలం తాము నమ్మిన సిద్ధాంత, రాజకీయాల ప్రతిపాదికన అంటూ చెప్పారు. మల్లా రాజిరెడ్డి అయితే మావోయిజానికి చావులేదని నిరంతరం అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. ఈ అంశాలను పరిశీలిస్తే తాము నమ్మిన రాజకీయాలతో ఇతర నిర్మాణాల్లో ఇముడలేని పరిస్థితి ఉంటుందని భావించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నట్లు భావిస్తున్నారు. కొత్త పార్టీకి అడ్డంకులు లేకుండా ఉండేందుకు సీఎం రేవంత్ లాంటి ముందు తమ ప్రతిపాదనలు సూటిగానే వెల్లడించారని భావిస్తున్నారు. ముఖ్యంగా తాము రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే మావోయిస్టులమనే ముద్రతో తిరిగి తమపై అణచివేత, నిర్భంధం ప్రయోగించేందుకు అవకాశం లేకుండా సహకారాన్ని కొరుతున్నట్లు భావిస్తున్నారు. ఈ అంశం పై సీఎం రేవంత్ కూడా ఆయుధాలు లేకుండా ప్రజాస్వామిక పద్ధతిల్లో పనిచేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూనే కేంద్రం నిర్ణయం పై స్పష్టమైన హామీ ఇవ్వకుండా అమిత్ షాతో మాట్లాడుతానని చెప్పడం గమనార్హం. ఇక పీఎల్జీఎ రద్దు, ఇతర మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశాలపై లొంగిపోయిన నేతలు చేసే ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చూ. అటు వైపు నుంచి కూడా పెద్దగా విభేదించేందుకో, విమర్శించేందుకో తగిన బలం లేకపోవడం గమనార్హం. అదే విధంగా నక్సలైట్ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీ, అర్బన్ నక్సలైట్లంటూ ఇటీవల కొత్త రాగం ఎత్తుకున్న నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు నేతలు చట్టబద్ధమైన పద్ధతుల్లో కార్యకలాపాలు చేపడితే అంత సులువుగా అంగీకరిస్తుందా? అనేది అనుమానం. అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎవరూ కాదనలేరనే అభిప్రాయం మరో వైపు ఉంది.

ప్రత్యామ్నాయాలున్నా….పార్టీ వైపే మొగ్గు?

లొంగిపోయిన మావోయిస్టుల ముందున్న కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒక విధంగా ఇందులో కొన్ని సులువైనవి కూడా కావచ్చు. నాలుగున్న దశాబ్దాలు అడవిలో ఆయుధంతో అనేక ఆటుపోట్ల మధ్య జీవితాలు కొనసాగించి, దాదాపు జీవిత చరమాంకంలోకి వచ్చారు. లొంగిపోయిన వారిలో అగ్రనేతలు 50 సంవత్సరాల వయస్సుకు లోబడి ఉన్నవారు తక్కువ మంది. ఈ వయస్సులో కాసింత విశ్రాంతికి అవకాశం ఉన్నది. కానీ, ఆ చాన్సు వైపు చూడకుండా తమ రాజకీయాభిప్రాయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలతో నడవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనేది పక్కనపెడితే లొంగుబాటు తర్వాత కూడా తాము ప్రజా జీవితాలను కొనసాగించే తీరుపై స్పష్టత ఉందని చెప్పవచ్చు. ఎలాగు లొంగిపోయారు. వారికి ఏ రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా సాధారణ జీవితాన్ని గడపే అవకాశం ఉంది. తమకున్న రాజకీయ అనుభవంతో ఇతర పాలక రాజకీయ పార్టీల్లో చేరి నాయకులుగా చెలామని అయ్యేందుకు ఛాన్సు ఉంది. ఇప్పటికి చాలా మంది ఈ జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీ కాకుండా ఇతర విప్లవపార్టీలు లేదా తాము నమ్మిన రాజకీయ విప్లవ ప్రజాసంఘ వేదికల్లో పనిచేసేందుకు వీలున్నది. కానీ, వీటిని కాదని కొత్త ప్రయత్నం, ప్రయోగానికి ఈ అగ్రనేతలు సిద్ధం కావడమే ఇక్కడ ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది.

దేవ్ జీ నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ?

తాజా రాజకీయ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అనేది సాంకేతికంగా మాత్రమే మిగిలి ఉన్న అంశంగా భావిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారు, లొంగిపోయిన వారు కాకుండా ప్రస్తుతం పార్టీ కార్యక్షేత్రంలో ఉంటూ పనిచేస్తున్న నేతలు వేళ్ళమీద లెక్కించే మంది మాత్రమే ఉన్నారు. పార్టీగా నిర్మాణాత్మకంగా ఆ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. కగార్ ఆపరేషన్ నుంచి కొలుకొని భవిష్యత్తులో తిరిగి పార్టీ రూపం సంతరించుకుంటుందా? దీనికి ఎంత సమయం పడుతుంది? అసలు తిరిగి పార్టీ రూపం తీసుకునే పరిస్థితులున్నాయా? అనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాజకీయ నిర్మాణంతో విభేదించేవారుగానీ, లొంగిపోయిన వారుగానీ తమ భవిష్యత్తు నిర్ధేశించుకోవడం అంత సులువైంది కాదు. అందులో ఇంతకాలం నమ్మిన రాజకీయ జీవితాలను కొనసాగించడమనేది చాలా కష్టమైన అంశం. ఇప్పటికే ఇంతకాలం మావోయిస్టుపార్టీ కొనసాగించిన ఆచరణపై పార్టీ నుంచి బయటికి వచ్చిన వారికి మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. మల్లోజుల, తక్కెళ్ళపెల్లిలకు తాజాగా లొంగిపోయిన దేవ్ జీ బృందం మధ్య కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తేనెతుట్టెను కదిలించకుండా తమకున్న అనుభవంతోపాటు, తాము నమ్మిన రాజకీయాలను ఆచరించేందుకు తాజాగా లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్, గంగన్న, సుజాతక్కలు ఈ దిశగా ప్రయత్నిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. వీరికి మరికొంత మంది అండగా నిలుస్తున్నట్లు భావిస్తున్నారు. కగార్ అపరేషన్ నేపథ్యంలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆయుధాలతో సహా కొందరు, ఆయుధాలు లేకుండా కొందరు లొంగిపోయారు. ఎవరు ఎలా? లొంగిపోయినప్పటికీ పార్టీలో రెండు రాజకీయాభిప్రాయాలున్నాయనేది బహిరంగ అంశం. ఈ మేరకు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి ఇరువర్గాల నేతలు లొంగుబాట పట్టారు. దేవ్ జీ బృందం లొంగుబాటుపై విమర్శలున్నప్పటికీ మల్లోజుల, తక్కెళ్ళపెల్లి లొంగుబాటు పై జరిగిన విమర్శల దాడి ఇక్కడ తక్కువగా ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే లొంగిపోయిన మావోయిస్టు నేతలు బహిరంగ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే మల్లోజుల, తక్కెళ్ళపెల్లి లాంటి వాళ్ళు కలిసివస్తారా? లేదా? రాజకీయ విభేదాలున్నట్లేనా? అనే చర్చ ఒక వైపు ఉన్నది. మాజీ మావోయిస్టు జంపన్న లాంటి వారు అందరూ కలిసిసాగాలని సూచిస్తున్నప్పటికీ ఈ అంశం రానున్నరోజుల్లో తేలనున్నది. పార్టీ ఏర్పాటుతోపాటు నిర్మాణాత్మకంగా దాన్ని కొనసాగించడం మాటలకు, ఆచరణకు ఎంతో తేడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలుగా, అజ్ఞాతంలో ఉన్నంత కాలం వారి మాట చెల్లుబాటయ్యే తీరుకు, లొంగిపోయిన తర్వాత వారి మాటకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. అయితే నమ్మిన రాజకీయాలకు కొత్త పార్టీ వేదికగా మారుతుందని భావించి, కొత్త ప్రయోగానికి సిద్ధమైతే ఏ మేరకు సానుకూల ఫలితాలొస్తాయనేది పక్కనపెడితే తెలంగాణ నేల మరో కొత్త ప్రయోగానికి వేదికగా మారనున్నదా? అనే చర్చ మాత్రం సాగుతోంది.
!!!