• Telugu News
  • /Politics

అమరావతిపైజగన్ విద్వేషం..విధ్వంసాన్ని సాగనివ్వం: చంద్రబాబు

అమరావతి రాజధానిపై జగన్ విద్వేషం చూపుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజధాని నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు.

Reported by: Tejaswini Nanna | రాజకీయాలు | Apr 09, 2026, 5:32 pm IST
Read Time: 6 mins
అమరావతిపైజగన్ విద్వేషం..విధ్వంసాన్ని సాగనివ్వం: చంద్రబాబు

విధాత : అమరావతి రాజధానిపై వైఎస్.జగన్ ప్రదర్శిసున్న విద్వేషం..విధ్వంసాన్ని సాగనివ్వబోమని సీఎం చంద్రబాబు అన్నారు. వేయి మంది సైకో జగన్ లు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగబోదన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పేరుతో మావిగన్ అంటున్నారని, అది సీఆర్డీఏ పరిధిలోనే ఉందన్న సంగతి అతడికి తెలియకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు

జగన్ సహా వైసీపీ నేతలు…అమరావతి పేరు కూడా పలకడానికి ఇష్టం లేక విధ్వంసం సృష్టించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికి నాకు నిముషం పట్టదు అని, అయితే చట్టం తన పనితాను చేసుకుంటుందన్నారు. రౌడీయిజం బ్యాచ్ , సైకో ప్రవర్తనలతో, వితండవాదాలు చేస్తున్నారని, అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్ళిపోతారు కాని..జగన్ కూడా అంతే ఎక్కడో ఉండి దుష్ప్రచారం చేసి పారిపోతాడు అని చంద్రబాబు విమర్శించారు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అని అబద్ధాలు చెప్తున్నారు…అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

విధ్వంస పాలకులను ప్రజలు దూరం పెట్టాలి

విధ్వంసం, విద్వేషంతో రగిలిపోయే పార్టీలను, జగన్ వంటి నాయకులను ప్రజలు దూరం పెట్టాలని చంద్రబాబు కోరారు. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడి చేస్తున్నారని, ఆడబిడ్డల్ని వేధించారని, ఇలాంటి ప్రవర్తనపై సమాధానం చెప్పే పరిస్థితి సైకో పార్టీకి లేదు అని మండిపడ్డారు. ఇలాంటి తరహా వ్యక్తి రాజకీయ పార్టీ వెనుక లేకపోతే ఇంటి నుంచి బయటకు రాగలడా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే మనం అంతా కలిసి కాపాడుకోవాలని, ఇప్పటికే రాష్ట్రం విభజన వల్ల, గత పాలకుల వల్ల చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం అన్నారు. నేను నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు లేకుండా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు అని, విధ్వంసం సృష్టించే వ్యక్తులు ఉంటే ప్రజలకు, ఆడబిడ్డలకూ రాష్ట్రంలో రక్షణ ఉంటుందా.? అని ప్రశ్నించారు. ఇలాంటి పార్టీలను వ్యక్తులను, మర్చిపోవటమే ప్రజలకు శ్రేయస్కరం అన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా మన జీవనం కూడా ప్రభావితం అవుతోందని, గ్యాస్ కొరత, ఉత్పత్తులు ఎగుమతి చేసుకోలేని పరిస్థితి ఉంది. దీని నుంచి బయటపడాలన్నారు. మన ఉత్పత్తులకు సప్లై చెయిన్, మార్కెట్లను గుర్తించి వాటిని ఎగుమతి చేసుకోనేలా ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలిపారు. సూపర్ సిక్స్ లాంటి పథకాలను సూపర్ హిట్ చేశాం, స్త్రీశక్తితో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం అని గుర్తు చేశారు. త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రాబోతున్నాయని, మహిళలకు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే మా లక్ష్యం అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

మూడు వేల కోట్లతో హైదరాబాద్‌లో మరో వెయ్యి కిలోమీటర్ల రహదారుల అప్‌గ్రేడ్‌
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..జలపాతంలో పడి ముగ్గురి మృతి