Alcohol Party | రూ. 2.28 లక్షల కోసం.. 10 నిమిషాల్లోనే లీటర్ మద్యాన్ని తాగి.. ప్రాణాలు కోల్పోయాడు..

Alcohol Party | పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వీకెండ్స్‌లో ఉద్యోగులందరూ పార్టీలు చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కంపెనీ యజమానులే పార్టీలు ఏర్పాటు చేసి, ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటారు. ఆ మాదిరిగానే చైనాకు చెందిన ఓ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఆ పార్టీలో కంపెనీ యజమాని ఓ పందెం పెట్టాడు. తక్కువ సమయంలో ఎక్కువ మద్యం సేవించిన వారికి విలువైన బహుమతి ఇస్తానని చెప్పాడు. ఈ పందెంలో పాల్గొన్న ఓ ఉద్యోగి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ కంపెనీ యజమాని యాంగ్.. తమ ఉద్యోగులకు మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఒక లీటర్ ఆల్కహాల్‌ను కేవలం 10 నిమిషాల్లో తాగిన వారికి 5 వేల యువాన్‌లు అంటే రూ. 58 వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఈ ఆఫర్‌కు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 10 వేల యువాన్‌లు(రూ. 1.15 లక్షలు) ఇస్తానని మరోసారి ఆఫర్ ఇచ్చాడు. అయినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఎవరూ ఊహించని విధంగా 20 వేల యువాన్‌లు ఇస్తానని ప్రకటించాడు. అంటే భారతీయ కరెన్సీలో రూ. 2.28 లక్షలు అన్నమాట.
ఈ ఆఫర్‌కు ఉద్యోగి జాంగ్ స్పందించాడు. 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న మద్యాన్ని ఎంచుకున్నాడు. లీటర్ మద్యాన్ని కేవలం 10 నిమిషాల్లోనే గుటగుటా తాగేశాడు. కానీ క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జాంగ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తక్కువ సమయంలో అతిగా మద్యం సేవించడం వల్లే ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యూమోనియా, ఊపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి కారణాలతో జాంగ్ మరణించి ఉంటారని వైద్యులు పేర్కొన్నారు.