నేటి నుంచి నిరుద్యోగ చైత‌న్య యాత్ర ప్రారంభం.. ప్ర‌ధాన ల‌క్ష్యాలు ఇవే..

నేటి నుంచి నిరుద్యోగ చైత‌న్య యాత్ర ప్రారంభం.. ప్ర‌ధాన ల‌క్ష్యాలు ఇవే..

హైద‌రాబాద్ : నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీలు, కోర్టు కేసుల నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్థితి. దీంతో ఏండ్ల త‌ర‌బ‌డి ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. నిరుద్యోగుల‌ను నిలువునా మోసం చేసిన కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు తెలంగాణ నిరుద్యోగులు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే నిరుద్యోగ చైత‌న్య బ‌స్సు యాత్ర‌కు నిరుద్యోగులు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తించ‌డంతో.. బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌న్ పార్క్ వ‌ద్ద యాత్ర ప్రారంభం కానుంది. నిరుద్యోగ చైత‌న్య బ‌స్సు యాత్ర‌ను ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్, ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్, మాజీ ఐఏఎస్ ఆకునూరి ముర‌ళి, ప్రొఫెస‌ర్ రియాజ్ జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. నిరుద్యోగులంతా భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బ‌స్సు యాత్ర నిర్వాహ‌కులు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యాత్ర నేటి నుంచి 25వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన‌సాగ‌నుంది.

నిరుద్యోగ చైత‌న్య యాత్ర ప్ర‌ధాన ల‌క్ష్యాలు ఇవే..

1. గత ప‌దేండ్ల‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్, పరీక్ష నిర్వహణ లోపాలపై ఛార్జ్ షీట్ విడుదల చేసి ప్రచారం చేయడం.

2. పూర్తిగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన డిమాండ్, దాని అవసరాన్ని చర్చిస్తూ ప్రచారం చేయడం.

3. ఉద్యోగ నియామకాల గురించి కేటీఆర్, హరీష్ రావుల తప్పుడు ప్రచారాన్ని బహిర్గత పరచడం.

4. ఉద్యోగాల నియామకానికి జాబ్ క్యాలెండ‌ర్‌ సంసిద్ధం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నిరుద్యోగులను చైతన్యం చేయడం.