Woman attack on Traffic SI | నడిరోడ్డుపై ట్రాఫిక్ ఎస్ఐని చెప్పుతో కొట్టిన మహిళ

Woman attack on Traffic SI | ఓ మహిళ అత్యుత్సాహం ప్రదర్శించింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ ఎస్ఐపై చేయి చేసుకుంది. వాహనదారులు అందరూ చూస్తుండగానే.. ఎస్ఐపై చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ఏరియాలో ఓ ప్రధాన రహదారిపై ఓ మహిళ తన వాహనాన్ని ఆపింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. ట్రాఫిక్ జామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ ఎస్ఐ వాహనాన్ని రోడ్డుపై నుంచి తీసేయాలని సదరు మహిళను ఆదేశించాడు. ఆమె అవేమీ వినిపించుకోకుండా, ఎస్ఐపై చెప్పుతో దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం ఎస్ఐ కూడా ఒకానొక దశలో పైకి చేయి లేపాడు. ఈ ఘటనను స్థానికులు తమ మొబైల్స్‌లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ ఘటనపై ట్రాఫిక్ ఏసీపీ పూనం మిశ్రా స్పందించారు. ఇందిరాపురం ఏరియాలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని ఫిర్యాదులు అందాక, ఎస్ఐ అక్కడికి వెళ్లారని తెలిపారు. రోడ్డుపై నుంచి వాహనాన్ని తీయాలని ఆదేశించినందుకు ఎస్ఐపై మహిళ చెప్పుతో దాడి చేసిందని తెలిపారు. అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించిన మహిళపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. గతంలోనూ ఆమె పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు నివేదికలు ఉన్నాయని పూనం మిశ్రా తెలిపారు.