మేడారం వెళ్ల‌లేని భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ఆన్‌లైన్‌లోనూ మొక్కులు..!

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భక్తులు ఇంటి నుంచే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే అవకావాన్ని కల్పించింది.

మేడారం వెళ్ల‌లేని భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ఆన్‌లైన్‌లోనూ  మొక్కులు..!

హైద‌రాబాద్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌. తెలంగాణ‌తో పాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఏపీ, ఒడిశా, జార్ఖండ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల భ‌క్తులు మేడారం జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తుంటారు. అయితే జాత‌ర‌కు వెళ్ల‌లేని భ‌క్తుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. త‌మ ఇంటి నుంచే నిలువెత్తు బంగారం(బెల్లం) స‌మ‌ర్పించే అవ‌కాశాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ క‌ల్పించింది. ఈ సేవ‌ల‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధ‌వారం ప్రారంభించారు.

మీ సేవ ద్వారా మొక్కులు చెల్లించొచ్చు..

భక్తులు మీ సేవ, పోస్టాఫీసు, టీయాప్‌ ఫోలియో (TAPP Folio) ద్వారా బుక్ చేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోవచ్చు. భక్తులు వారి బరువు ప్ర‌కారం.. 1 కేజీకి రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. నిలువెత్తు బంగారం సమర్పించేందుకు.. ఓ వ్యక్తి 50 కేజీలు ఉంటే.. బరువు ప్రకారం రూ.3000, మీ సేవా ఛార్జీలు రూ.35, పోస్టల్ ఛార్జీలు రూ.100 కలిసి మొత్తంగా రూ.3,135 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా మేడారం జాతర ప్రసాదం సైతం పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

మేడారం జాత‌ర రెండేండ్ల‌కు ఒక‌సారి మాఘ‌మాసంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21 నుంచి 24 వ‌ర‌కు మేడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదివరకే మంత్రులు మేడారం వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సైతం మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.