కొత్త చట్టంపై లారీ డ్రైవర్ల ఆందోళన ఇదీ!.. రెండో రోజూ రాస్తారోకో

హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో తీసుకొచ్చిన మార్పులపై లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటికి నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు

కొత్త చట్టంపై లారీ డ్రైవర్ల ఆందోళన ఇదీ!.. రెండో రోజూ రాస్తారోకో
  • హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై భారతీయ న్యాయ సంహితలో కఠిన నిబంధనలు
  • నిరసనకు దిగిన లారీ డ్రైవర్లు
  • మహారాష్ట్రలో రెండో రోజుకు చేరిన రాస్తారోకో

ముంబై: భారతీయ న్యాయ సంహితలో హిట్‌ అండ్‌ రన్‌ కేసుల విషయంలో పొందుపరిచిన కఠిన అంశాలకు నిరసనగా ట్రక్కర్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన రాస్తారోకో రెండో రోజుకు చేరుకున్నది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 1.20 లక్షల ట్రక్కులకు గాను దాదాపు 70శాతం వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయని అంచనా. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఇటువంటి ఆందోళనలే జరుగుతున్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. 


కొత్త చట్టంపై ట్రక్కర్ల ఆందోళన

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న భారతీయ న్యాయ సంహితలోని కొన్ని అంశాలపై ట్రక్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం.. తీవ్ర రోడ్డు ప్రమాదం చేసి, పోలీసులుకు లేదా అధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఏడు లక్షల జరిమానా విధిస్తారు. ఈ అంశంపై ఆలిండియా మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా సమ్మె పిలుపును ఇవ్వకున్నప్పటికీ ట్రక్కర్లు ఉన్నపళంగా ఆందోళనకు దిగారు. ఫలితంగా జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో లారీలు ఆగిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.


మరి డ్రైవర్ల రక్షణకు చర్యలేవి?

డ్రైవర్ల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూ అదే స్థాయిలో చట్టపరమైన చర్యలు చేపడితే తమకేమీ అభ్యంతరం లేదని ఆలిండియా మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) కోర్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌ మాల్కిత్‌ సింగ్‌ చెప్పారు. ఇందులో భాగస్వాముల ఆందోళనలను పరిష్కరించేందుకు పరిష్కారం చూపేందుకు చర్చలు పిలవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కొత్త చట్టంలో పొందుపర్చిన అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు ఏఐఎంటీసీ లేఖలు పంపింది. హిట్‌ రన్‌ ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవడం వెనుక ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ప్రతిపాది చట్టంలో అనేక సొసుగులు ఉన్నాయని, వాటిని తక్షణమే సరిచేయాల్సి ఉన్నదని కార్మిక నేతలు చెబుతున్నారు. ఈ చట్టం వల్ల కలిగే బలమైన దుష్పరిణమాల పట్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులైన రవాణారంగ, ట్రక్కు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రధాని, హోంమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టాన్ని భాగస్వాములతో ప్రత్యేకంగా రవాణా రంగ ప్రతినిధులతో చర్చించకుండానే తీసుకొచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం తీసుకొచ్చినప్పుడు దాని పర్యవసానాలను ఎదుర్కొనే వారి అభిప్రాయాలను విస్మరించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెనుక నుంచి లారీని ఢీకొట్టడం లేదా చిన్న వాహనాల డ్రైవర్ల పొరపాటు వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి విషయాల్లో స్పష్టత లేదని అంటున్నారు. హెవీ వెహికల్స్‌పైనే నెపం నెట్టేయడానికి బదులు నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

లారీల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్-అండ్-రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది. దీంతో ముందస్తుగా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నగర శివారులో పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, ఉప్పల్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగింది. అంతేకాకుండా కొన్ని పెట్రోల్ బంకులలో స్టాక్ లేదంటూ పెట్రోల్ బంకుల ఎంట్రీ క్లోజ్ చేసింది యాజమాన్యం.