Operation Sin door | సూత్రబద్ధత లేని ఈ దిక్కుమాలిన వైఖరి ప్రతిపక్షాలకు తగునా?

Operation Sin door | పార్లమెంటరీ ‘పడవ’ కాదని నాగపూర్ ‘నౌక’ ఎక్కడానికి సిద్దపడ్డ ఈ ప్రతిపక్షాలకు నిజమైన దేశభద్రత పట్ల నిబద్దత వుందని భావిద్దామా? దేశ సార్వభౌమాధికారం, దేశ భద్రతల పట్ల మోదీ సర్కార్ వైఖరి ఎలా వుందో చూద్దాం.
1-పహల్గామ్ భద్రతా వైఫల్యంపై విచారణ జరపడానికి ఒప్పుకోదు.
2-ఆపరేషన్ సిందూర్ వివరాల్ని దేశ ప్రజల ఎదుట పారదర్శకంగా ఉంచడానికి ఒప్పుకోదు.
3-ట్రంప్ దౌత్య ప్రక్రియను ఆమోదించడానికి ముందే ప్రతిపక్షాల్ని విశ్వాసంలోకి తీసుకోవాలనే రాజకీయ విజ్ఞతను ప్రదర్శించదు.
4-అత్యంత ప్రాధాన్యత గల క్రాస్ బోర్డర్ దాడులు చేపట్టే ముందే కనీసం తన స్వంత కాబినెట్ అత్యవసర సమావేశం సైతం జరపదు.
యుద్ధ రహస్యత పేరిట మోడీ సర్కార్ ఇవన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తూ పోతుంది. (అవి నిజానికి మోదీ వ్యక్తిగత నిర్ణయాలు కాదనుకోండి. నాగపూర్ కేంద్రం సమిష్టి నిర్ణయం తీసుకొని ఇచ్చే డైరెక్షన్ ఓ చేదు నిజం)
మరో సిగ్గుచేటైన సంగతి ఏమిటంటే, పాకిస్తాన్ పై దాడికి ముందే పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి మన విదేశాంగ మంత్రి వార్త అందించడం! కానీ యుద్ధ గోప్యత పేరిట ప్రధానంగా హిందువులతో కూడిన మన దేశ ప్రజలకు గానీ, ప్రతిపక్ష పార్టీలకు గానీ, చివరికి స్వంత క్యాబినెట్‌కు మాత్రమే దాచిపెట్టడం! పోనీ జరగబోతున్న రేపటి వార్తలు యుద్ధ గోప్యత పేరిట ముందే చెప్పలేదని సరిపెట్టుకుందాం. మరి గతించిన నిన్నటి చద్ది వార్తలు చెప్పడానికైనా దేశప్రజలకూ, ప్రతిపక్ష పార్టీలకూ అర్హత లేదా?
పైన ఓ నాలుగు అంశాల్ని ఉదహరించడం జరిగింది. అవి భవిష్యత్తులో చేపట్టే రేపటి విషయాలు కదా! మరి గతించిన నిన్నటి అంశాల గూర్చి ఇప్పుడు ఉదహరిద్దాం.
1-ట్రంప్ దౌత్యంపై వచ్చిన ఆరోపణలపై, ముఖ్యంగా దేశ సార్వభౌమాధికారం గూర్చి వచ్చిన విమర్శల పై వివరణ ఇవ్వడానికి ఆ తర్వాతనైనా అఖిలపక్ష సమావేశం వేయడానికి ససేమిరా ఒప్పుకోదు.
2-ట్రంప్ దయతో “శాంతి” ఒప్పందం కుదిరాకనైనా, అంటే సాధారణ పరిస్థితి పునరుద్దరణ జరిగిన తర్వాతనైనా జరిగిన పరిణామాల పై ఉన్నత స్థాయి విచారణ జరిపి వాస్తవాల్ని దేశ ప్రజల ఎదుట వెల్లడించడానికి సిద్దపడదు.
3-ఈ అన్నిటి పై సమగ్ర చర్చ కోసం అత్యవసర ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల కనీస కోర్కెని సైతం ఒప్పుకోలేదు.
4-స్వయంగా ప్రధాని జాయింట్ పార్లమెంటరీ బృందాలకి హాజరై దిశా నిర్దేశం చేసే పద్దతినైనా పాటించదు. (విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరిస్తారు.)
ఇలాంటి దిక్కుమాలిన మహా ఘనత వహించిన (మ.ఘ.వ.) జాయింట్ పార్లమెంటరీ బృందాల్లో చేరడానికి ప్రతిపక్షాలు దేశ విశాల ప్రయోజనాల పేరిట సిద్దపడ్డ విధానం అత్యంత సిగ్గుచేటైనది.
మరో నగ్నమైన, సిగ్గు లేని నీతిబాహ్య అంశం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇచ్చిన ఎంపీల్ని పక్కకుపెట్టి, కాంగ్రెస్ లో బీజేపీ కోవర్ట్ ని కాంగ్రెస్ పార్టీ తరపున జాయింట్ పార్లమెంటరీ బృంద సారధిగా ఎంపిక చేయడం! ఇండియా కూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్నే అవమానించే వైఖరిని మోదీ సర్కార్ చేపట్టింది. తమ కూటమి సారధినే కోవర్ట్ ఆపరేషన్ ద్వారా దెబ్బతీస్తున్నా, ఆ కూటమి భాగస్వామ్య ప్రతిపక్షాలు ఎందుకు బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించగలేదు? (నా కామెంట్ పార్లమెంటరీ బృందాల్లో చేరడానికి ఆమోదించిన ఇండియా కూటమి సభ్య పక్షాలకు మాత్రమే వర్తిస్తుంది)
ఈ పనికిమాలిన కమిటీ 33 దేశాధినేతలకి ఇండో పాక్ యుద్ధస్థితి గూర్చి వివరిస్తారట! పైగా UNO లో 195 దేశాలు వుంటే, 33 దేశాల వరకే ఎందుకు పరిమితం చేశారు?
195 మైనస్ 33, మైనస్ పాకిస్తాన్, మైనస్ మన దేశం కాకుండా మిగిలిన 163 దేశాలను ఎందుకు వదిలింది? ఏ దేశాలను ఎంపిక చేసి, ఏ దేశాలను వదిలేసింది? ఈ ఎంపిక వెనక అంతర్జాతీయ గాడ్ ఫాదర్ అమెరికా పాత్ర, ప్రమేయాలు ఉన్నాయా? అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ల చేజిక్కిన మీడియా తన అసత్య ప్రచారంతో దేశ ప్రజల్ని అపోహలకు గురిచేసి నమ్మిస్తుంది. ఈ అసత్య ప్రచార దుమారంలో సత్యాలు కనఁబడవు. అలా సమాధి పాలైన వెయ్యు సత్యాలలో ఒక అసత్యం ఈ సందర్బంగా చెప్పాల్సి వస్తున్నది. ఈ భూమండలం మీద పాక్ పై ఆపరేషన్ సింధూర్ కి మద్దతు ఇచ్చిన దేశాల సంఖ్య తెల్సుకుందామా?
UNO లో 195 దేశాలు వుంటే ఒకే ఒక్క దేశం మద్దతు ఇచ్చింది. అదే నరహంతక, నరమాంస భక్షణకు భూమండలం పై పేరొందిన మ.ఘ.వ. ఇజ్రాయిల్! ఈ ఒక్కటే కాదు సుమా! మరో దేశం కూడా ఉందోయ్! అయితే అది ఇప్పుటికీ UNO లో సభ్యత్వం పొందలేదు. అదే ఆఫఘానిస్తాన్! దానిని పాలించే తాలిబన్ ప్రభుత్వం పాక్ పై భారత్ దాడికి మద్దతు ఇవ్వడం ప్రపంచ వింతల్లోకెల్ల పెను వింత! పీత బాధ పీతదైతే చేప బాధ చేపదన్నట్లు అమెరికా దురాక్రమణ నుండి మూడేండ్ల క్రితమే స్వాతంత్య్రం పొందిన ఆ దేశానికి UNO సభ్యత్వం ఇవ్వలేదు. దానిని ఎవరు సిపారస్ చేసి ఇప్పిస్తారా అని ఎదురు చూస్తోన్న తాలిబన్ సర్కార్ కి మోడీ సర్కార్ అంతర్గత హామీ ఇచ్చి మద్దతు పొందడం గమనార్హం! రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో సహా స్వంత బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలని వదిలేసుకొని, తాలీబన్ సర్కార్ అండ కోసం ప్రాకులాడడం మన దేశ దుస్థితికి నిదర్శనం. ఇదీ నేడు అంతర్జాతీయ రంగంలో మన పరిస్థితి! ఈ నేపథ్య పరిస్థితుల నుండి ప్రపంచ దేశాలకు జాయింట్ పార్లమెంటరీ బృందాల ప్రహసనాన్ని విశ్లేషణ చేయాల్సి వుంది. కనీసంలో కనీస నైతిక, రాజకీయ ప్రమాణాలు పాటించదు. ఏ చట్టబద్ద, న్యాయబద్ద, సూత్రబద్ద, నీతిబద్ద, రీతిబద్ద పద్దతి పాటించదు. పార్లమెంటరీ సాంప్రదాయ పద్దతుల్ని పాటించదు. నాగపూర్ కేంద్రం నుండి అందుకున్న ఆదేశాలే శిరోధార్యం.
ఇక ఈ పార్లమెంటరీ బృందాల పని ఏమిటో! ఏఏ దేశాలకు వెళ్లి ఏఏ ఊసులు చెబుతాయో! వాళ్ళు అడిగే ప్రశ్నలకు అక్కడ ఏఏ జవాబులు చెప్పుకుంటారో! వెంటనే నోటికి జవాబు రాకపోతే, అక్కడ నుండి హాట్ లైన్ లో నాగపూర్ బాబు గారైన మోడీతో మాట్లాడతారేమో! ఆ బాబు నాగపూర్ కేంద్రం నుండి ఏ జవాబులు ఇవ్వాలో తెల్సుకొని తిరిగి మన మ.ఘ.వ. ప్రతిపక్షాలతో కూడిన బృందాలకు వివరణల్ని ఇస్తారేమో! మోడీ వేసిన గ్రామ్ ఫోన్ రికార్డ్ ని ప్రపంచ దేశాల నేతలకి తిరిగి ప్లే చేస్తారేమో! ఆ ప్రహసన, హాస్యాస్పద గ్లోబల్ నాటక ప్రదర్శనకి మ.ఘ.వ. ప్రతిపక్షాలతో కూడిన మన జాయింట్ పార్లమెంటరీ బృందాలు ప్రయాణానికి ఏర్పాటు జరిగింది. మరో రెండు రోజుల్లో న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ ప్లైట్స్ లో పది రోజుల ప్రత్యేక అంతర్జాతీయ రాజకీయ విహారానికి నడుములు బిగిస్తున్నాయి. నాగపూర్ రిమోట్ కంట్రోల్ బటన్ ఆడిస్తే ఆడే ప్రకారం మన దేశాన్ని ఫాసిస్టు ప్రమాదం నుండి విముక్తి చేస్తారని కల కందామా?
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
19-5-2025