మ‌ళ్లీ ప‌వన్ -త్రివిక్ర‌మ్ కాంబోలో సినిమా.. లీక్ చేసిన నిర్మాత‌

మ‌ళ్లీ ప‌వన్ -త్రివిక్ర‌మ్ కాంబోలో సినిమా.. లీక్ చేసిన నిర్మాత‌

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే జ‌నాల‌కి ఎంత పిచ్చి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సినిమాకి మించిన బంధం. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య సాన్నిహిత్యం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరగా మహేష్ బాబుతో గుంటూరు కారం చిత్రం తెరకెక్కించారు. అయితే టీవల ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కలిసి చేసిన అజ్ఞాతవాసి మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన విషయం తెలిసిందే.

అయితే గుంటూరు కారం త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఏ మూవీ చేయ‌బోతాడు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. దీనిపై తాజాగా క్లారిటీ వ‌చ్చింది. వాస్తవానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. కానీ బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ తదుపరి ప్లాన్ ఏంటో తెలియడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అనే న్యూస్ వైరల్ గా మారింది. విషయం ఏమిటంటే, ప్రస్తుతం రవితేజ తో ఈగిల్ మూవీ నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ నేడు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 9న రానున్న ఈగిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు

త్రివిక్రమ్, పవన్ ల కాంబినేషన్ లో ఒక భారీ మూవీ ప్లాన్ చేస్తున్నామని, అయితే దాని పై ఆ ఇద్దరి నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అన్నారు. ఒకవేళ అది ఫిక్స్ అయితే పూర్తి వివరాలు మీడియాకి తెలియపరుస్తాం అని ఆయన తెలిపారు. ప‌వ‌న్ -త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాప‌కాల‌ని తాజా చిత్రం తుడిచి పెట్టాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.