LPG Gas Cylinder | మరో రెండు రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పు..?
LPG Gas Cylinder | ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మాదిరిగానే సెప్టెంబర్ 1వ తేదీన మారే అవకాశం ఉంది. గృహావసరాల సిలిండర్ ధరల్లో మార్పు ఉండకపోయినప్పటికీ, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది.

LPG Gas Cylinder | మరో రెండు రోజుల్లో సెప్టెంబర్( September ) నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక సిలిండర్ ( Gas Cylinder ) వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రతి నెల మాదిరిగానే.. సెప్టెంబర్ 1వ తేదీన వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరల్లో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్( Commercial Gas Cylinder ) ధరలతో పాటు ఏటీఎఫ్( ATF ), సీఎన్‌జీ(CNG ), పీఎన్‌జీ( PNG ) ధరలను కూడా సవరించే అవకాశం ఉంది. ఈ మార్పులు రవాణా ఖర్చుల్ని, వస్తువులు, సేవల ధరల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
గత ఆగస్టు నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మార్చడంతో.. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఆగస్టు నెలలో దేశంలోని వివిధ నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 6.50 నుంచి రూ. 9 వరకు పెరిగింది. నాడు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లకు మాత్రమే ధర పెరిగింది.
ఆగస్టుకు ముందు.. వరుసగా 4 నెలలు ధర తగ్గింపు
ఆగస్టుకు ముందు, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర వరుసగా నాలుగు నెలల పాటు తగ్గింది. జులై 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజి సిలిండర్ ధర సుమారు రూ. 30, జూన్ 1వ తేదీన ఇదే సిలిండర్‌పై రూ. 19, మే 1వ తేదీన రూ. 19, ఏప్రిల్ ఒకటిన రూ. 35 చొప్పున ధరలు తగ్గాయి. ఏప్రిల్‌కు ముందు, వరుసగా మూడు నెలల పాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి.
డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు నిరాశే..!
ఇక గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సామాన్య ప్రజలకు ఈసారి కూడా నిరాశ తప్పేలా లేదు. ఈ ఏడాది మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటును రూ. 100 తగ్గించింది. సామాన్య పౌరులు ఉపయోగించే గ్యాస్ బండ రేటును తగ్గించడం అదే చివరిసారి. అప్పటి నుంచి, 5 నెలలుగా డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.