Satellite Internet | ఇండియాలో ఇక మస్క్‌ ఇంటర్నెట్‌.. స్టార్‌లింక్‌కు కేంద్రం ప్రత్యేక అనుమతి

భూ కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను ఉపయోగించి, ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ను ఆకాశం నుంచే ఇది పంపిస్తుంది. ఫైబర్‌ కేబుల్స్‌ వంటి సాధారణ ఇంటర్‌నెట్‌ లైన్స్‌ వేయడానికి అవకాశం లేని ప్రాంతాలకు ఇంటర్‌నెట్ అందించేందుకు ఈ తరహా సర్వీసులు చాలా ఉపయోగపడతాయి.

Satellite Internet | ఇండియాలో ఇక మస్క్‌ ఇంటర్నెట్‌.. స్టార్‌లింక్‌కు కేంద్రం ప్రత్యేక అనుమతి

Satellite Internet | దేశంలో త్వరలో మస్క్‌ కంపెనీ ఇంటర్‌నెట్‌ వ్యాపారం మొదలు కానున్నది. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్‌నెట్ కంపెనీ స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఈ లైసెన్స్‌ను జీఎంపీసీఎస్‌ అని పిలుస్తారు. అంటే.. గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌. ఈ అనుమతితో ఉపగ్రహాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ రంగంలోకి స్టార్‌లింక్‌ అడుగు పెట్టనున్నది. ఇటువంటి అనుమతి పొందిన మూడో కంపెనీగా స్టార్‌లింక్‌ నిలిచింది. ఇప్పటికే యూటెల్‌శాట్‌ మద్దతు ఉన్న వన్‌వెబ్‌, ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ జియో ఈ అనుమతిని పొందాయి. ఇప్పుడు మస్క్‌ కంపెనీకి కూడా అనుమతి ఇవ్వడంతో భారత టెలికమ్యూనికేషన్ల మార్కెట్‌లోకి స్టార్‌లింక్‌ ప్రవేశించనున్నది.

భారత మార్కెట్‌లోకి చొరబడేందుకు మస్క్‌ కంపెనీ 2021లోనే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కస్టమర్ల నుంచి ప్రి ఆర్డర్స్‌ తీసుకోవడం కూడా ప్రారంభించింది. అయితే.. అందుకు తగిన లైసెన్స్‌ లేదు. దీంతో పాత కస్టమర్లకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని, కొత్త ఆర్డర్లు తీసుకోవడం నిలిపివేయాలని స్టార్‌లింక్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు లైసెన్స్‌ వచ్చిన నేపథ్యంలో స్టార్‌లింక్‌ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభించింది. స్టార్‌లింక్‌ కంపెనీ ఇప్పటికే 125కు పైగా దేశాల్లో ఉపగ్రహ ఇంటర్‌నెట్‌ సేవలు అందిస్తున్నది.

భూ కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను ఉపయోగించి, ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ను ఆకాశం నుంచే ఇది పంపిస్తుంది. ఫైబర్‌ కేబుల్స్‌ వంటి సాధారణ ఇంటర్‌నెట్‌ లైన్స్‌ వేయడానికి అవకాశం లేని ప్రాంతాలకు ఇంటర్‌నెట్ అందించేందుకు ఈ తరహా సర్వీసులు చాలా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలతోపాట.. ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న ప్రాంతాలకు ఇది బాగా ఉపకరిస్తుంది. ఇంటర్‌నెట్‌ ఖరీదైన వ్యవహారంగా ఉండే మారు మూల ప్రాంతాల వారికి వేగంగా నెట్‌ సేవలను అందిస్తుంది. ఇదే తరహా లైసెన్స్‌ కోసం జెఫ్‌ బెజోస్‌కు చెందిన అమెజాన్‌ విభాగం కుయిపర్‌ ఎదురు చూస్తున్నది. యాపిల్‌ భాగస్వామి అయిన గ్లోబల్‌ స్టార్‌ సైతం ఈ మార్కెట్‌లోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్నది. స్టార్‌లింక్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని భారతీయ టాప్‌ టెలికం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్‌, రిలయెన్స్‌ జియో 2025 మార్చిలో ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉపగ్రహ ఇంటర్‌నెట్‌ అనేది భారతీయ డిజిటల్‌ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నది.