Elon Musk | ట్రంప్‌ గాజా శాంతి మండలిపై మస్క్‌ సెటైర్లు.. మామూలుగా లేదుగా

ట్రంప్ 'శాంతి మండలి'పై మస్క్ పంచ్‌లు! పీస్ అంటే శాంతి కాదు 'భూభాగం ముక్క' అంటూ దావోస్‌లో సెటైర్లు. మిత్రుల మధ్య మొదలైన 'ముక్క'లాట.. పూర్తి వివరాలు..

Elon Musk | ట్రంప్‌ గాజా శాంతి మండలిపై మస్క్‌ సెటైర్లు.. మామూలుగా లేదుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)పై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరోసారి విమర్శలు గుప్పించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచ వేదికపై ట్రంప్‌పై సెటైర్లు వేశారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా 35 దేశాల మద్దతుతో శాంతి మండలిని (Board of Peace) ట్రంప్‌ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ దస్సులో తొలిసారి పాల్గొన్న మస్క్‌.. ట్రంప్‌ తెచ్చిన పీస్‌ బోర్డు గురించి ప్రస్తావించారు. ‘నేను బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి) గురించి విన్నాను. ఇక్కడ పీస్ (Peace) అంటే ముక్క (Piece) ఏమో. అంటే గ్రీన్ లాండ్‌లో కొంత ముక్క, వెనెజువెలాలో కొంత ముక్క.. ఇలా అన్నింట్లో కొంత ముక్క మాకు కావాలనే అర్థం ఉండొచ్చు’ అంటూ మస్క్ ట్రంప్‌ను ఉద్దేశించి సెటైర్లు పేల్చారు. మస్క్‌ మాటలకు వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కాగా, ఇటీవలే వెనెజువెలాపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యను నిర్బంధించి అమెరికాకు తరలించారు. ఆ తర్వాత వెనెజువెలాను తామే పాలిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్‌ కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. ఆ ద్వీప దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్‌ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మిత్రులు కాస్తా.. శత్రువులై..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్‌ సర్కార్‌ తెచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ (Big Beautiful Bill) వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఈ బిల్లును మస్క్‌ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బిల్లు విషయంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్‌పై మస్క్‌ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్‌ కూడా చేశారు. అంతేకాకుండా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పీస్‌ బోర్డు..

గాజాలో శాంతి స్థాపన, కాల్పుల విరమణ ఒప్పందం అమలు, పునర్నిర్మాణం, భద్రత సమన్వయం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు 35 దేశాల మద్దతుతో శాంతి మండలిని (పీస్‌ బోర్డు) ట్రంప్‌ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పత్రంపై ట్రంప్‌తోపాటు బహ్రెయిన్‌, మొరాకో, అజర్‌ బైజాన్‌ నాయకులు సంతకాలు చేశారు. తాను ఈ బృందానికి ప్రారంభ చైర్మన్‌గా ఉంటానని ట్రంప్‌ ప్రకటించారు. ఇందులో చేరాలని ప్రపంచ దేశాలకు ట్రంప్‌ ఇప్పటికే ఆహ్వానించారు. ఆహ్వానం అందినప్పటికీ భారత్‌ సహా పలు కీలక దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. చార్టర్‌పై సంతకం చేసిన దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఉన్నది.

పీస్‌ బోర్డు ప్రారంభం సందర్భంగా హమాస్‌కు ట్రంప్‌ కీలక హెచ్చరికలు చేశారు. ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హమాస్‌ నిరాయుధీకరణ విషయంలో ఎటువంటి రాజీ లేదని ట్రంప్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హమాస్‌ నిరాయుధీకరణే తాము కొత్తగా రూపొందించిన శాంతి మార్గదర్శకాల్లో మొదటిదని ట్రంప్‌ తెలిపారు. ఆయుధాలను వదిలిపెట్టేందుకు హమాస్‌ అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని ఈ సందర్భంగా ట్రంప్‌ హెచ్చరించారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక యుద్ధాలను ముగించానని, అతి త్వరలోనే మరో పరిష్కారం రానున్నదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి :

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
Pawan Kalyan First Wife Nandini | పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఆమె ఇప్పుడు ఏం చేస్తోందంటే.. బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?