Donald Trump | ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ..!
దావోస్‌లో ట్రంప్ చేతిపై మిస్టరీ గాయం! ఆరోగ్యంపై పెరుగుతున్న అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్. ఆస్పిరిన్ వాడకమే కారణమా?
అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపింది. గతంలో ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ కనిపించింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది. ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆరోగ్యంపై చర్చ ఊపందుకుంది.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై కమిలిన గాయం కనిపించింది. ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోల్లో ఈ విషయం బయటపడింది. ట్రంప్ ఎడమ చేతిపై రూపాయి బిల్ల సైజులో ఉన్న గాయం స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైట్‌హౌస్ ఏమన్నదంటే..?
తాజా ఆందోళనలపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పందించారు. దావోస్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో సంతకాలు చేసే సమయంలో టేబుల్ కార్నర్ తగలడంతోనే ట్రంప్ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. గాయానికి చికిత్స కూడా తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ట్రంప్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ షాన్ బార్బబెల్లా తెలిపారు.
ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు..
అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై గతకొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గతేడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక గతేడాది అనారోగ్యం వార్తల వేళ.. ట్రంప్ కొన్ని రోజులు బాహ్య ప్రపంచానికి కూడా కనిపించలేదు.
TRUMP IS DEAD ..
గతేడాది అక్టోబర్‌లో ట్రంప్ అనారోగ్యంపై జోరుగా వార్తలు ప్రచారమయ్యాయి. ఆ సమయంలో ఆయన వారం రోజులు ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో అనారోగ్యం వార్తల వేళ ట్రంప్ ‘అదృశ్యం’ వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. ఏది చెప్పాలన్నా నిమిషాల్లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యే అధ్యక్షుడు.. కొన్ని రోజుల పాటూ బాహ్యప్రపంచానికి కనిపించలేదు (no public appearances). ఎలాంటి మీడియా సమావేశాలనూ నిర్వహించలేదు. వారాంతంలో కూడా పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్‌లో లేకపోవడం అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో ‘అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమైంది..? ఆయన ఎక్కడ ఉన్నారు..? అసలు ఏం జరుగుతోంది?’ వంటి పోస్టులు నెట్టింట దర్శనమిచ్చాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి ‘ట్రంప్ చనిపోతే’ అంటూ పోస్టులు కూడా పెట్టారు. దీంతో గతేడాది ఎక్స్‌లో TRUMP IS DEAD ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Viral Video | అమెజాన్ అడవుల్లో అతిపెద్ద అనకొండ వీడియో వైరల్
Allahabad High Court | అలాంటి భర్త నుంచి భరణం ఆశించొద్దు : అలహాబాద్ కోర్టు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram