Elon Musk $1 Trillion | ఈలాన్ మస్క్‌కు టెస్లా రూ.88లక్షల కోట్ల ‘జీతం’
టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్‌కి షేర్‌హోల్డర్లు 1 ట్రిలియన్ డాలర్ల రికార్డు పేమెంట్ ప్యాకేజ్ ఆమోదించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.88 లక్షల కోట్లకు సమానం. AI, రోబోటిక్స్ లక్ష్యాలతో టెస్లా భవిష్యత్తుకు కొత్త దిశ.
Elon Musk’s $1 Trillion Tesla Pay Package Approved by Shareholders
- ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందబోతున్న సీఈఓ
- టెస్లా చరిత్రలోనే అతిపెద్ద వేతన ప్రణాళికకు ఆమోదం
- ఈ పదేళ్ల పేమెంట్కు “షరతులు వర్తిస్తాయి”
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడూ జరగని ఆర్థిక నిర్ణయం టెస్లాలో చోటుచేసుకుంది. కంపెనీ సీఈఓ ఈలాన్ మస్క్‌కి సుమారు 1 ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్లు) విలువైన రికార్డు పేమెంట్ ప్యాకేజ్ షేర్‌హోల్డర్లు ఆమోదించారు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు(1 పక్కన 12 సున్నాలు). బిలియన్ అంటే వంద కోట్లు(1 పక్కన 9 సున్నాలు). ఈ సంగతి చాలా పెద్దవాళ్లకు కూడా తెలియదనుకోండి. అది వేరే విషయం.
ఆస్టిన్ (టెక్సాస్)లో గురువారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో 75 శాతం ఓట్లతో ఈ వేతన ప్రణాళికకు మద్దతు లభించింది. ఫలితాలు ప్రకటించగానే మస్క్ స్టేజ్‌పైకి వచ్చి అభిమానుల చప్పట్ల మధ్య “సూపర్… అప్రిషియేట్ ఇట్” అంటూ డాన్స్ చేశారు.
టెస్లా విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనేది ‘షరతు’

ఈ ప్యాకేజ్ ప్రకారం, మస్క్‌కి నెలసరి జీతం లేదా నగదు బోనస్ ఏదీ ఉండదు. బదులుగా ఆయనకు 12 దశల్లో షేర్ల రూపంలో వేతనం లభిస్తుంది. ప్రతి దశలో టెస్లా మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లు పెరగాలి. ఆఖరి లక్ష్యం — కంపెనీ మొత్తం మార్కెట్ విలువను ప్రస్తుతం ఉన్న1.4 ట్రిలియన్ డాలర్ల నుండి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం.
నిర్ణీత సమయానికి ఈ టార్గెట్లన్నీ చేరుకుంటే, మస్క్‌కి సుమారు 42.3 కోట్ల కొత్త టెస్లా షేర్లు లభిస్తాయి.’అప్పటికి’ వాటి విలువ మొత్తం 1 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది. అయితే ఈ డాలర్లన్నీ ‘కాగితం’ మీదే. ఒక్క డాలర్ కూడా నగదు ఉండదు. కాకపోతే అప్పుడు టెస్లాలోని ఆయన వాటా 13 శాతం నుండి 25 శాతానికి పెరుగుతుంది.
మస్క్ సారథ్యంలో టెస్లా వచ్చే దశాబ్దంలో సాధించాల్సిన ముఖ్యమైన లక్ష్యాలు ఇలా ఉన్నాయి:
- 2 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి,
- 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోలు(ఆప్టిమస్) తయారీ,
- 1 కోటి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సబ్‌స్క్రిప్షన్లు,
- 40000 కోట్ల డాలర్ల వాస్తవ లాభ సాధన,
- 10 లక్షల రోబోటాక్సీల వాణిజ్య వినియోగం.
“ఇది మా చరిత్రలో కేవలం కొత్త అధ్యాయం కాదు… కొత్త పుస్తకం ప్రారంభం” — మస్క్
“మేము ఇప్పుడు టెస్లా భవిష్యత్తు కోసం కొత్త పుస్తకం రాయబోతున్నాం. ఇతర కంపెనీల వార్షిక సమావేశాలు విసుగ్గా ఉంటాయి. టెస్లావి మాత్రం ఫుల్ ఎనర్జీతో నిండిపోతాయి,” అని మస్క్ అన్నారు. అతని వ్యాఖ్యలు వినగానే హాల్ అంతా “ఈలాన్… ఈలాన్…” అని నినాదాలతో మార్మోగింది.
‘ఆప్టిమస్’ రోబో – మస్క్ నూతన స్వప్నం

ఈ సమావేశంలో మస్క్ ప్రత్యేకంగా ‘ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబో ప్రాజెక్ట్‌ను ప్రస్తావించారు. 2022లో టెస్లా మొదటిసారిగా ప్రదర్శించిన ఈ రోబో “ప్రమాదకరమైన లేదా పదేపదే చేయాల్సిన పనులను స్వయంచాలకంగా చేయగల” విధంగా రూపొందించబడింది. మస్క్ మాట్లాడుతూ, ఇది ఫ్యాక్టరీల్లోనే కాకుండా ఇళ్లలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆప్టిమస్ రోబో ఉంటుందని అన్నారు. ఈ రోబో టెస్లా వాహనాలు వాడే కృత్రిమ మేధ (AI) వ్యవస్థనే ఉపయోగిస్తుంది. మస్క్ దృష్టిలో టెస్లా భవిష్యత్తు ఇప్పుడు AI + రోబోటిక్స్ పైనే ఆధారపడి ఉంది.
మస్క్‌కు ఆమోదించిన ఈ ప్యాకేజీపై విమర్శలూ తారాస్థాయిలో వెల్లువెత్తాయి. గ్లాస్ లూయిస్, ఇన్‌స్టిట్యూషనల్ షేర్‌హోల్డర్ సర్వీసెస్ (ISS) వంటి పరోక్ష సలహా సంస్థలు ఈ ప్రణాళికను అసమగ్రంగా, మితిమీరినదిగా అభివర్ణించాయి. వీరు తమ విశ్లేషణలో, మస్క్‌కి ఇప్పటికే కంపెనీపై విస్తృతమైన ఆర్థిక నియంత్రణ ఉంది. అంత పెద్ద పే ప్యాకేజీ అవసరం లేదని పేర్కొన్నారు. నార్వే సార్వభౌమ ఫండ్, కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (CalPERS) వంటి భారీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఈ ప్యాకేజ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
అయితే టెస్లా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా మద్దతు తెలపడంతో ప్రణాళిక ఆమోదం పొందింది. టెస్లా బోర్డు చైర్ రోబిన్ డెన్‌హోల్మ్, మస్క్ లేకపోతే టెస్లా దారితప్పే అవకాశం ఉంది. ఆయనను నిలబెట్టుకోవడం కంపెనీ భవిష్యత్తుకు అత్యవసరమని వ్యాఖ్యానించారు.
డెలావేర్ కోర్టు వ్యతిరేక తీర్పు, టెక్సాస్‌కు మారిన రిజిస్ట్రేషన్
2018లో టెస్లా మస్క్‌కి ఇచ్చిన 56 బిలియన్ డాలర్ల వేతన ప్రణాళికను డెలావేర్ కోర్టు రద్దు చేసింది. బోర్డు సభ్యులు మస్క్‌కి చాలా సన్నిహితులని, ఆ ప్రణాళికలో న్యాయబద్ధత లేదని కోర్టు అభిప్రాయపడింది. అందుకని అటువంటి సమస్యలు రాకుండా ఈసారి టెస్లా డెలావేర్ నుంచి టెక్సాస్‌కు రీ-ఇన్‌కార్పొరేట్ అయి, అదే ప్యాకేజీని బాహుబలి ప్యాకేజీగా మార్చింది. ప్రస్తుత ప్యాకేజ్ విలువ గతంలో ప్రతిపాదించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ –1 ట్రిలియన్ డాలర్లు, అంటే 2018 ప్లాన్‌కి దాదాపు పది రెట్లు.
మస్క్ రాజకీయ వివాదాలు, బ్రాండ్ ఇమేజ్ సమస్య
టెస్లా విక్రయాలు గత ఏడాది తగ్గినా, షేర్ ధరలు 62 శాతం పెరిగాయి. అయితే మస్క్ రాజకీయ ప్రవర్తన, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలు, రైట్‌వింగ్ వ్యాఖ్యలు — కంపెనీ బ్రాండ్ విలువపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్వెస్టర్ రాస్ గెర్బర్ మాట్లాడుతూ, మస్క్ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు టెస్లా బ్రాండ్ విలువను తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ ఆయన లేని టెస్లాను ఊహించలేమన్నారు. వెడ్‌బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డాన్ ఐవ్స్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫలితంతో AI విప్లవం ప్రారంభమైంది. టెస్లా ఇప్పుడు కేవలం కార్ల కంపెనీ కాదు, AI ఆధారిత భవిష్యత్ సాంకేతిక దిగ్గజమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో ప్రొఫెసర్ ఆన్ లిప్టన్, మస్క్ ఈ కొత్త లక్ష్యాలను చేరుకుంటాడో లేదో చెప్పడం కష్టం. కానీ ఆయన గతంలో లక్ష్యాలను ముందుగానే చేరుకున్న దాఖలాలున్నాయని గుర్తు చేశారు.
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త చరిత్ర
ప్రస్తుత ప్యాకేజ్‌ను పరిశీలిస్తే, మస్క్ సంపాదన ప్రపంచంలోని ఇతర సీఈఓలతో పోలిస్తే 10–12 రెట్లు ఎక్కువ. ఉదాహరణకు:
- మైక్రోసాఫ్ట్ : సత్య నాదెళ్ల – 791 కోట్ల డాలర్లు
- ఆపిల్ : టిమ్ కుక్ – 746 కోట్ల డాలర్లు
- ఎన్విడియా : జెన్సెన్ హువాంగ్ – 499 కోట్ల డాలర్లు
- మెటా : మార్క్ జుకర్‌బర్గ్ – 272 కోట్ల డాలర్లు
- అల్ఫాబెట్ : సుందర్ పిచాయ్ – 107 కోట్ల డాలర్లు
నిజానికి ఇవన్నీ కలిపినా మస్క్ కొత్త ప్యాకేజీ స్థాయికి చేరవు. అమెరికన్ మీడియా వ్యాఖ్యానించినట్టుగా, “ఇది మస్క్ కోసం కార్పొరేట్ ప్రపంచం వేసిన బంగారు సంకెళ్లు”.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram