హైదరాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,420 పెరిగి రూ. 1,55,350కి చేరగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,300పెరిగి రూ. 1,42,400కు చేరింది. కిలో వెండి ధర రూ. 10,000పెరిగి రూ. 2,75,000వద్ద కొనసాగుతుంది.
ఇరాన్ – అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనపడకపోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సేఫ్ హెవన్ ఆస్తుల వైపు మళ్లించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు $4,850 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్సుకు $81 డాలర్ల సమీపానికి ఎగబాకింది. దీంతో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి.
బంగారం, వెండి ధరలు ఇలా భారీగా పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరగొచ్చన్న ఆశలు. దీనివల్ల ఇంధన ధరల ద్రవ్యోల్బణం తగ్గుతుందనే అంచనాలున్నాయి. రెండోది, చమురు ధరలు బ్యారెల్‌కు $90 డాలర్ల సమీపానికి పడిపోవడం. ఇక మూడోది, అమెరికా డాలర్ విలువ ఆరు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
