విధాత, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో హెచ్చు తగ్గులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ.1,54,750వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 1,41,850 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 2,74,900వద్ద నిలిచింది.
ధరల పతనం ఎంతకాలం..
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పతనమవ్వడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు వారాల్లోనే దాదాపు 8శాతం మేరకు బంగారం ధరలు క్షీణించాయి. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో బంగారం ధర అంచనాను ఔన్సుకు 5,700 డాలర్ల నుండి 5,200 డాలర్లకు తగ్గించింది.పెరిగిన బాండ్ రాబడులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలో జాప్యం వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అంచనా వేసింది. ధరల పతనానికి డిమాండ్ తగ్గడం కంటే సరఫరా, ద్రవ్యోల్బణ అంచనాలే ప్రధాన కారణంగా చెబుతుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది, కానీ ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో రాబడులు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుండి బాండ్ల వైపు మళ్లుతున్నారు.మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణ భయాలు వ్యక్తమవ్వడం బాండ్ రాబడులను పెంచింది. వడ్డీ చెల్లించని ఆస్తి అయిన బంగారం, వడ్డీనిచ్చే బాండ్ల ముందు పోటీ పడలేక ఒత్తిడికి గురవుతోందని మోర్గాన్ స్టాన్లీ అంచనా.
భవిష్యత్తులో పెరుగడం ఖాయం
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలను ఈ ఏడాది చివరికి (సెప్టెంబర్ లేదా డిసెంబర్) వాయిదా వేయడం వల్ల సమీప భవిష్యత్తులో ధరలు భారీగా పెరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కేంద్ర బ్యాంకుల వద్ద ఇంకా భారీ నిల్వలు ఉండటం, ప్రపంచవ్యాప్త అప్పులు, రాజకీయ అనిశ్చితి దీర్ఘకాలంలో బంగారానికి అండగా నిలుస్తాయని మెర్గాన్ స్టాన్లీ అభిప్రాయ పడింది. వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభమైతే లేదా ద్రవ్యోల్బణం మళ్లీ అదుపు తప్పితే బంగారం వేగంగా పుంజుకుని 5,000 డాలర్ల నుండి 6,000 డాలర్ల మధ్యకు చేరే అవకాశం ఉందంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఆర్థిక గణాంకాలను గమనిస్తూ కొద్దికొద్దిగా బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
