SIP Investment Guide | ఎస్ఐపీలో పెట్టుబడులతో లాభాలు వస్తాయా?
ఎస్ఐపీ ద్వారా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి రాబడులు సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్స్ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో ఎస్ఐపీ (SIP) పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే విధానాన్ని ఎస్ఐపీ అంటారు. ఒక స్థిరమైన కాల పరిమితికి స్థిరమైన పెట్టుబడి పెట్టే విధానమే ఇది. మార్కెట్ ఒడిదొడుకులకు సంబంధం లేకుండా పెట్టుబడి పెట్టిన వ్యక్తుల ప్రయోజనాలను కాపాడుతోందనేది మార్కెట్ నిపుణుల మాట. ఒకే సమయంలో భారీ పెట్టుబడి పెట్టడం కంటే కాల క్రమేణా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ మొత్తంలో రాబడులకు ఎస్ఐపీ దోహదం చేస్తోంది.
ఎస్ఐపీలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఎస్ఐపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే 18 ఏళ్లు నిండాలి. మైనర్లు కూడా ఎస్ఐపీలో పెట్టుబడులు పెట్టవచ్చు. తమ పేరేంట్స్ ద్వారా లేదా కోర్టు నియమించిన లీగల్ గార్డియన్ ద్వారా ఎస్ఐపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా ఏ రంగాలకు చెందినవారైనా ఎస్ఐపీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎస్ఐపీలో కనీస పెట్టుబడి రూ. 100. అయితే చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రూ. 500 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి పరిమితి లేదు. మీ ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికను అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఎస్ఐపీలో పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడి పెట్టాలనుకున్న ఫండ్స్ గురించి పరిశోధించాలి.
ఎస్ఐపీ లో రకాలు ఎన్ని?
ఎస్ఐపీలో ఆరు రకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. రెగ్యులర్ లేదా ఫిక్స్ డ్ ఎస్ఐపీ, టాప్ అప్ ఎస్ఐపీ, ఫ్లెక్సీబుల్ ఎస్ఐపీ, మల్టీపుల్ ఎస్ఐపీ, శాశ్వత ఎస్ఐపీ, ట్రిగ్గర్ ఎస్ఐపీలు అనే ఆరు రకాల ఎస్ఐపీలున్నాయి.
1. రెగ్యులర్ లేదా ఫిక్స్ డ్ ఎస్ఐపీ: దీన్ని సంప్రదాయ పెట్టుబడి విధానం అని కూడా అంటారు. ప్రతి నెలా నిర్ధేశించిన పెట్టుబడి పెట్టడమే ఈ స్కీమ్ ఉద్దేశం. అంటే ప్రతి నెల రూ. 500 లేదా రూ. 1000 ఎంత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే అంత మేరకు పెట్టుబడిని పెటడమే దీని లక్ష్యం.
2. టాప్ అప్ ఎస్ఐపీ: దీన్ని స్టెప్ అప్ ఎస్ఐపీ అని కూడా పిలుస్తారు. మీరు పెట్టుబడిని పెంచుకొనేందుకు అనుమతి ఇస్తాయి. మీ ఆదాయం పెరుగుతుందని భావిస్తే ఈ టాప్ అప్ ఎస్ఐపీని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
3. ఫ్లెక్సిబుల్ ఎస్ఐపీ: మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో తక్కువ పెట్టుబడి పెట్టేందుకు, మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ఫ్లెక్సిబుల్ ఎస్ఐపీ దోహదం చేస్తుంది.
4.మల్టీపుల్ ఎస్ఐపీ: దీన్నే బహుళ ఎస్ఐపీ అని కూడా పిలుస్తారు. ఈ ఒక్క ప్లాన్ ద్వారానే అనేక మ్యూచ్ వల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టవవచ్చు. ఇది మీ ఫోర్ట్ ఫోలియోను వైవిధ్యపర్చేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో పెట్టుబడి స్థిరంగా ఉంటుంది. రాబడి సామర్థ్యాన్ని పెంచుతుంది.
5. శాశ్వత ఎస్ఐపీ: దీనికి నిర్ధిష్ట గడువు ఉండదు. మీరు కోరుకున్నంత కాలం పెట్టుబడి పెట్టవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది.
6. ట్రిగ్గర్ ఎస్ఐపీ: నిర్ధిష్ట మార్కెట్ పరిస్థితులను లేదా పెట్టుబడుల కోసం ట్రిగ్గర్ పాయింట్లను ఎంచుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంటే మార్కెట్ పరిస్థితులు లేదా మార్కెట్ ఒడిదొడుకుల
ఆధారంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది దోహదం చేస్తుంది.
ఇక ఎస్ఐపీలలో ప్రతి నెల, ప్రతి వారం, మూడు నెలలకు, ఒకేసారి పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు ఎస్ఐపీని ఎంపిక చేసుకొనే సమయంలోనే ఈ ఆఫ్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎస్ఐపీలో ఈ సూత్రం పాటించాలి
మార్కెట్ ఒడిదొడుకుల ఆధారంగానే ఎస్ఐపీలపై పెట్టిన పెట్టుబడులపై లాభాలైనా, నష్టాలైనా వస్తాయి. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు వచ్చినా ఇబ్బంది ఉండదనేది మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టే సమయంలో 7-5-3-1 అనే నియమాన్ని గుర్తుంచుకోవాలనేది సూచన. అంటే దీని అర్ధం ఏంటంటే ఏడేళ్లు కనీసం పెట్టుబడి పెట్టాలి. ఐదు వేర్వేరు ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టాలి. ఉదహరణకు స్మాల్, క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఈటీఎఫ్, వాల్యూ స్టాక్స్, గ్లోబల్ స్టాక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. నిరాశ, చికాకు, భయాందోళన దశలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉండాలి. ఎస్ఐపీలో మీరు పెట్టుబడి పెట్టిన సమయంలో మీరు ఆశించినట్టుగా రిటర్న్స్ రాకపోవచ్చు. అలాంటి సమయంలో నిరాశ చెందవద్దు. ఇక మీ పెట్టుబడిపై వడ్డీ కొన్ని సమయాల్లో 7 శాతం కంటే తక్కువగా రావచ్చు. ఇది అసంతృప్తి, చికాకుకు దారితీయవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని తెలిస్తే మీలో ఆందోళన, భయం కూడా కలుగుతుంది. ఏడాదికి ఎస్ఐపీ మొత్తాన్ని ఒక్కసారి పెంచాలి. ఈ సూత్రాలను పాటిస్తే ఎస్ఐపీలో పెట్టిన పెట్టుబడికి ఇబ్బందులు ఉండవనేది నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఒడిదొడుకులు వచ్చిన సమయంలో దీర్ఘకాలంలో వేర్వేరు ఫండ్స్ ల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక దానిలో నష్టాలు వచ్చినా… వేరే దానిలో లాభాలు వస్తాయి. ఇలా మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. మరో వైపు దీర్ఘకాలం కాల పరిమితి ఎంచుకున్నందున కనీసం 12 నుంచి 18 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.
లాభాలు ఎలా వస్తాయి?
మార్కెట్ తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ యూనిట్లు, మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయడాన్ని రూపాయి కాస్ట్ ఎవరేజింగ్ అని పిలుస్తారు. మార్కెట్ ను గమనిస్తూ యూనిట్లు కొనుగోలు చేయడం వల్ల యూనిట్ల ధరలు తగ్గుతాయి. ఇది మీ లాభాలను పెంచుతుంది. మీరు సంపాదించిన లాభాలు తిరిగి మీ పెట్టుబడుల్లో కలుస్తాయి. దీర్ఘకాలంలో ఈ కాంపౌండింగ్ ప్రభావం మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నందున మార్కెట్ పడిపోయినా ఇబ్బందులు తప్పవు.
నోట్… ఎస్ఐపీలపై అవగాహన కోసం మాత్రమే. ఎస్ఐపీ, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర రకాల పెట్టుబడులపై మార్కెట్ నిపుణుల సూచనల ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి