దేశంలో రోజురోజుకూ మండిపోతున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లను చూసి జనం హడలిపోతున్నారు. ఎండల వేడి కన్నా ఇవి ఎక్కువగా బాధపెడుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం రెండు వారాల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెంచింది. ఒక లీటర్ పై పన్నులు మినహా రూ.7.5 భారం పెంచారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై ఒకే రోజు రూ.1వేయి వరకు పెంపుదల చేయడంతో హోటల్, ఆతిథ్య రంగం యజమానులు కంగుతిన్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్ రీఫిల్లింగ్ కొనుగోలు చేయడానికి రూ.3వేల వరకు వెచ్చించాల్సిన దుస్థితి కల్పించారు.
తెలంగాణలో ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ రూ.115.19 చొప్పున బంకులలో విక్రయిస్తున్నారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఛార్జీలు, రాష్ట్ర స్థాయి వ్యాట్ లకు డీలర్ కమిషన్ కూడా కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తడిసి మోపెడు అవుతున్నాయి. కానీ.. వంద రూపాయల లోపే లీటరు పెట్రోల్ దొరికే ప్రాంతాలు కూడా దేశంలో ఉన్నాయి.
దేశంలో కొన్ని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ దీవులలో ఒక లీటర్ పెట్రోల్ రూ.82.46కు విక్రయిస్తున్నారు. అదనపు పన్నులు లేకుండా విక్రయించడం మూలంగా చౌక ధరకు పెట్రోల్ దొరుకుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతాలకు పన్నులలో మినహాయింపులు ఇవ్వడం మూలంగా తక్కువ ధరకు ఇంధనం, ఇంధన ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. బార్లలో కూడా మద్యం, తినుబండారాల ధరలు కూడా చౌకగానే ఉంటాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో రూ.90, దాద్రా అండ్ నగర్ హవేలీ తో పాటు డయ్యూ డమన్ లో రూ.92 చొప్పున అమ్ముతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రూ.100 లోపే విక్రయిస్తున్నారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 చొప్పున వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. ముంబై మహా నగరంలో ధరలు అత్యధికంగానే ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107కు లభ్యమవుతున్నది. ఆంధ్రప్రదేశ్, కేరళం, తెలంగాణలో కూడా తక్కువేమీ లేవు. వాహనదారులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా పన్నులు విధిస్తూ, వాహనదారుల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ముగిసే వరకు ఇంధన ధరల పెంపుపై మౌనంగా ఉన్న ఆయిల్ కంపెనీలు వారం రోజులు గా ధరలు పెంచుతునే ఉన్నాయి. పోలింగ్ సమయంలో ధరలు పెంచడం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా బుకాయించింది. ఓట్ల లెక్కింపు అయిన తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఆయిల్ కంపెనీలు బాదడం మొదలు పెట్టాయి. గతంలో అర్థరాత్రి నుంచి ధరల పెంపుదలను అమలు చేసే ఆయిల్ కంపెనీలు ఉదయం 6 గంటల నుంచి అమలు చేసే విధానాన్ని 2017 లో ప్రారంభించాయి. పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని, ఫలితంగా ఆయిల్ కంపెనీలకు రూ.1 లక్ష కోట్ల నష్టం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం బొంకుతున్నది. నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచక తప్పడం లేదని బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంటున్నది. ఆయిల్ కంపెనీలతో పోటీపడి రాష్ట్రాలు వ్యాట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాయి తప్పితే ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదు.
Read Also |
మొన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాజకీయ రుతుపవనం తెలంగాణనూ తాకేనా? రేవంత్ వద్ద ‘ప్లాన్ బీ’ ఉందా?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఈ పని చేయకపోతే సబ్సిడీ కట్
ట్రంప్ పేరుతో చావు తప్పించుకున్న గేదె !
