ఐఫోన్ 16 విడుదల తేదీ వచ్చేసింది..!
It’s Glowtime : యాపిల్ ఐఫోన్ వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తేదీ రానే వచ్చింది. సెప్టెంబర్ 9, 2024న యాపిల్ ఈవెంట్ ఇట్స్ గ్లోటైమ్‌ను ప్రకటించింది. ఇందులో ఈ ఏటి ఐఫోన్ 16 సిరీస్, ఇంకా ఇతర ఉపకరణాలకు ప్రకటించనుంది.

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్(Apple) సెప్టెంబర్ 9న ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసింది. దీని పేరు ఇట్స్ గ్లోటైమ్(It’s Glowtime). ఈ ఈవెంట్లోనే తన ప్రముఖ ఫోన్ ఐఫోన్ 16 సిరీస్(iPhone 16 Series) ఫోన్లను, ఎయిర్‌పాడ్ల(Airpods 4)ను, ఇంకా ఇతర ఉత్పత్తులను ప్రకటించనుంది. ముఖ్యంగా ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏఐ ఆధారిత ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసే తేదీని కూడా అప్పుడే యాపిల్ ప్రకటిస్తుంది. కాలిఫోర్నియా, క్యుపర్టినోలోని యాపిల్ క్యాంపస్(Apple Campus)లో ఈ ఈవెంట్ జరగనుంది.
ఈసారి ఐఫోన్లో ప్రవేశపెట్టనున్న మార్పులలో ముఖ్యమైనది యాపిల్ ఇంటెలిజెన్స్(Apple Intelligence). అలాగే 16 సిరీస్ నాలుగు ఫోన్లలో 16, 16ప్లస్ మెయిన్ కెమెరా వ్యవస్థ నిలువుగా(Vertical Capsule) క్యాప్యూల్ మాదిరిగా మారనుంది. కాగా, 16ప్రొ, ప్రొమ్యాక్స్‌లకు పెద్ద స్క్రీన్లతో పాటు బ్రాంజ్ కలర్ అదనంగా ఉండనుంది. ఈసారి అన్ని ఫోన్లకు యాక్షన్ బటన్ ఏర్పాటు చేయనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సౌలభ్యం 15ప్రొ, ప్రొమ్యాక్స్‌లలో మాత్రమే ఉండేది. 16 సిరీస్ ఫోన్లలో ఇంకో బటన్ కూడా అమర్చనున్నారు. అది ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రత్యేకం. ఈ ఐఫోన్ 16 యాపిల్‌కు కూడా ప్రత్యేకమైనది. తన పోటీదారులైన సామ్‌సంగ్, గూగుల్‌లు గెలాక్సీ ఎస్24(S24), ఫోల్డ్6, పిక్సెల్9(Pixel 9) సిరిస్లలో పూర్తిస్థాయి కృత్రిమ మేధను పొందుపరిచారు. వాటితో గట్టిపోటీనెదుర్కుంటున్న యాపిల్ తన ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ తో ఎలా పనిచేస్తుందన్నదీ, వినియోగదారులను ఎంతమేరకు ఆకర్షిస్తున్నది అందరికీ ప్రశ్నార్థకమే. యాపిల్ సిరి, ఇంకా ఇతర యాపిల్ యాప్లు ఏఐతో పనిచేయనున్నాయి. ఇందుకోసం యాపిల్ చాట్జిపిటి(ChatGPT)తో జతకలిసింది.
ఐఫోన్లతో పాటు ఎయిర్‌పాడ్4(Airpods 4)ను, యాపిల్ వాచ్ 10(Apple Watch Series 10)ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎయిర్‌పాడ్4 అనేది ఈ సిరీస్‌లో బేసిక్ మాడల్. ప్రొ మాడల్‌లో ఇంకా ఎయిర్‌పాడ్ 3 ప్రొ విడుదల కాలేదు. యాపిల్ వాచ్ మాత్రం 10 సిరిస్‌లో వాచ్ అల్ట్రాను కూడా విడుదల చేస్తుంది.