Layoffs 2024 | ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం లాంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్టు ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే టెక్ కంపెనీలు 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఆ రిపోర్టు పేర్కొంది.
Layoffs 2024 : ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం లాంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్టు ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే టెక్ కంపెనీలు 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఆ రిపోర్టు పేర్కొంది.
లేఆఫ్స్.ఎఫ్వైఈ (layoffs.fyi) ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుంచి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల్లో 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
జనవరి నెలలో 122 కంపెనీల్లో 34,107 ఉద్యోగాలకు కోతలు పడ్డాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. మార్చిలో 37 టెక్ కంపెనీలు 7,403 మంది ఉద్యోగులను తీసేశాయి. మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్ నెలలో మూడింతలు అధికంగా 21 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.
యాపిల్ కంపెనీ ఇటీవల 614 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తీసేసింది. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది. ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తీసేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని తొలగించింది.
అదేవిధంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగులను తగ్గించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ 1,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. టెక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికామ్ కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది.