Bajaj Pulsar | దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పాపులర్ మోడలర్ పల్సర్ N160 రేంజ్‌లో సరికొత్త ప్రీమియం వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. స్పోర్ట్స్ లుక్‌తో పాటు క్రేజీ ఫీచర్లతో ఈ బైక్‌ను లాంచ్ చేసింది. కొత్త ఫీచర్లు, ప్రీమియం హార్డ్‌వేర్ అప్‌డేట్లతో వచ్చిన ఈ మోడల్ ధరను రూ.1.22 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.
స్టైలిష్ లుక్‌ను కోరుకునే యూత్‌ను లక్ష్యంగా చేసుకుని బజాజ్ ఆటో పల్సర్ N160 బైక్‌ను నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్రూక్లిన్ బ్లాక్, పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే రంగుల్లో కొత్త పల్సర్ ప్రీమియం వేరియంట్ లభించనుంది. ఇక ఈ కొత్త మోడల్‌లో ప్రధాన అప్‌డేట్‌గా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను జోడించింది. ట్రాఫిక్‌లో తరచూ గేర్లు మార్చడం వల్ల క్లచ్ లివర్‌పై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి తగ్గించడంతో పాటు వేగంగా డౌన్‌షిఫ్ట్ చేసే సమయంలో వెనుక చక్రం జంప్ అవ్వకుండా నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల స్మూత్ రైడింగ్ అనుభూతి కలుగుతుంది.
అలాగే ఈ బైక్‌లో గోల్డెన్ ఫినిష్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను అమర్చారు. ఇది బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా రోడ్లపై సడెన్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు, హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు బైక్ అస్సలు ఊగకుండా అద్భుతమైన స్టెబిలిటీ, రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది.
ఫీచర్లపరంగా చూస్తే.. ఈ పల్సర్ N160 బైక్‌లో ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ చానల్ ఏబీఎస్ భద్రతను కల్పించారు. ఈ బైక్‌లో 300mm ఫ్రంట్ డిస్క్, 230mm రియర్ డిస్క్ బ్రేక్ అందించారు. టెక్నాలజీ లవర్స్ కోసం ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అమర్చారు. టాప్ ఎండ్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు విభిన్న రోడ్ల కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్‌లు అందించారు. USB Type C చార్జింగ్ పోర్టు, సింగిల్ పీస్ సీటు వంటి సదుపాయాలు ఉన్నాయి. రాత్రి సమయంలో రోడ్లు స్పష్టంగా కనిపించేందుకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కూడా ఇచ్చారు.
ఇంజిన్‌పరంగా ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మోడల్‌లో ఉన్న 164.82 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించారు. ఇది 15.5bhp పవర్, 14.65nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
బజాజ్ ఆటో కంపెనీ ఈ పల్సర్ N160 మోడల్‌ను వివిధ వేరియంట్లలో విడుదల చేసింది. వాటిలో సింగిల్ చానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.16లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ మార్కెట్‌లో టీవీఎస్ అపాచీ RTR160, Yamaha FZ, Hero Xtream 140 4V మోడళ్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని ఆటో మొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More:
మరింత ప్రీమియం లుక్‌లో 2026 టాటా టియాగో ఈవీ.. కీలక మార్పులివే!
మినీ కూపర్ స్పెషల్ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. వీటి ధర ఎంతంటే..!
