500 Rupee Notes Fake News | రూ.500 నోట్లు చెల్లవా? : క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌

వైరల్ మెసేజ్‌లో చెబుతున్నట్లు రూ.500 నోట్లు 2026 నాటికి రద్దు కానున్నాయన్నది తప్పుడు సమాచారం అని PIB స్పష్టం చేసింది. RBI నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, రూ.500 నోట్లు యథావిధిగా చలామణిలోనే ఉన్నాయని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

500 Rupee Notes Fake News | రూ.500 నోట్లు చెల్లవా? : క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌

500 Rupee Notes Fake News | రూ.500 నోట్లను రద్దు చేస్తున్నారని వచ్చిన వైరల్ సందేశం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. వాట్సాప్ లో “ఫార్వార్డ్ మెసేజ్” రూపంలో విస్తృతంగా పంచబడిన ఈ ప్రచారం ప్రకారం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 మార్చి నాటికి రూ.500 నోట్లను మార్కెట్ నుంచి పూర్తిగా తీసేసే దిశగా చర్యలు ప్రారంభించిందని పేర్కొనబడింది. ఈ సందేశంలో సెప్టెంబర్ 30, 2025 నాటికి 75 శాతం ATMలలో రూ.500 నోట్ల పంపిణీని ఆపాలని, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ATMల నుంచి వాటిని పూర్తిగా తొలగించాలని RBI అన్ని బ్యాంకులకు ఆదేశించిందని పేర్కొంటూ, ప్రజలను వెంటనే తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను ‘లిక్విడేట్’ చేయమని హెచ్చరిస్తోంది. ఈ సమాచారంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొనగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) దీనిపై స్పందించి స్పష్టతనిచ్చింది. PIB యొక్క నిజ నిర్ధరణ విభాగం() ఈ సందేశాన్ని పూర్తిగా తప్పుడు సమాచారం మరియు తప్పుదారి పట్టించే ప్రకటనగా ఖండించింది. అధికారికంగా ట్విట్టర్ (X) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, రూ.500 నోట్లపై ఎలాంటి మార్పులు తీసుకురావాలని RBI ఎప్పుడూ చెప్పలేదని, వాటిని నిలిపివేయాలన్న ఆదేశాలు కూడా ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని నమ్మకూడదని, అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అయితే ఈ తప్పుడు ప్రచారం వెనుక కూడా ఒక నమ్మకమైన ఆధారం ఉంది. 2025 ఏప్రిల్‌లో RBI ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో ATMల ద్వారా చిన్న నోట్ల లభ్యతను పెంచాలని సూచించింది. అందులో సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశవ్యాప్తంగా ATMలలో కనీసం 75 శాతం కేసెట్లలోరూ.100 లేదా రూ.200 నోట్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో మార్గదర్శకాలు ఇచ్చింది. 2026 మార్చి 31 నాటికి ఈ శాతం 90కి పెరగాలని పేర్కొంది. అయితే ఇందులో రూ.500 నోట్లపై ఎలాంటి సూచన లేదు. అయినప్పటికీ, కొంతమంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రజలలో భయాన్ని రేకెత్తించే విధంగా ప్రచారం చేశారు.

ఈ దుష్ప్రచారాన్ని మరింత విస్తరింపజేసినది యూట్యూబ్​లోని కొన్ని ఛానళ్లు. ముఖ్యంగా ‘కాపిటల్ టీవీ’ అనే ఛానల్ విడుదల చేసిన వీడియో ప్రజల్లో మరింత కలకలం రేపింది. ప్రజలు మళ్లీ 2016 డీమానిటైజేషన్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ తమ వద్ద ఉన్న రూ.500 నోట్ల భద్రతపై ఆందోళన చెందడం ప్రారంభించారు. దీనిపై స్పందించిన PIB తక్షణమే “రూ.500 నోట్లు చట్టబద్ధమైన చలామణి నోట్లు” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంకులు, ATMలు, వ్యాపార కేంద్రాలు ఈ నోట్లు యధావిధిగా స్వీకరిస్తున్నాయని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో తిరుగుతున్న దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఎలాంటి నోట్ల మార్పు నిర్ణయం తీసుకున్నా, దానిని అధికారికంగా RBI ప్రెస్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. వాట్సాప్ మెసేజ్‌లు, యూట్యూబ్​ వీడియోల ఆధారంగా ఆందోళన చెందడం అవసరం లేదు. ప్రస్తుతం రూ.500 నోట్లు పూర్తిగా చెలామణిలో ఉన్నాయని, వాటిపై నమ్మకంతో లావాదేవీలు కొనసాగించవచ్చని RBI పునరుద్ఘాటించింది. తప్పుడు ప్రచారాలు ప్రజలలో భయం, అనవసర ఆర్థిక అవస్థలు కలిగించవచ్చని PIB హెచ్చరించింది. ప్రజలు అధికారిక వేదికలను మాత్రమే నమ్మాలని మరోసారి స్పష్టం చేసింది.