Petrol, diesel price cut । పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్న కేంద్రం!.. ఎప్పటి నుంచంటే..
గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నదని తెలుస్తున్నది. దీనికి తోడు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ (Pankaj Jain) గత నెలలో చేసిన వ్యాఖ్యలను బట్టి.. కేంద్రం ఈ ఆలోచనలో ఉన్నట్టు వెల్లడవుతున్నదని CLSA తన నివేదికలో పేర్కొన్నది.

Petrol, diesel price cut । పెట్రోల్ ధరలు (Petrol, diesel prices) సాధారణ, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించాయి. పెట్రోల్ ధరల భారం, దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువుల మీద ఉండటమే కాకుండా.. సగటు ప్రజల జేబును గుల్ల చేస్తున్నది. పైగా త్వరలో అత్యంత కీలకమైన మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మహాయుతి పక్షాలు (BJP-led alliance) నానా తంటాలు పడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నదని తెలుస్తున్నది. దీనికి తోడు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ (Pankaj Jain) గత నెలలో చేసిన వ్యాఖ్యలను బట్టి.. కేంద్రం ఈ ఆలోచనలో ఉన్నట్టు వెల్లడవుతున్నదని CLSA తన నివేదికలో పేర్కొన్నది.
ఈ ఏడాది మార్చి (March 2024) నుంచి పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర కొంతకాలంగా తక్కువుగా ఉన్నది. ఇదే ధోరణి మరికొంతకాలం కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాయని జైన్ వ్యాఖ్యనించినట్టు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ‘మహారాష్ట్ర ఎన్నికలు (Maharashtra’s state elections) బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి చాలా కీలకం. ప్రజాదరణ పొందే (populist move) క్రమంలో భాగంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాన్ని కేంద్రం పరిశీలించవచ్చు’ అని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో పేర్కొన్నది. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. తుది తేదీలను అక్టోబర్ నెల మధ్యలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5న ధరల తగ్గింపు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నదని సీఎల్‌ఎస్‌ఏ నివేదిక అంచనా వేసింది.
రిటైల్ ధర తగ్గింపుతోపాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని (excise duty) పెంచే అవకాశాలు ఉన్నట్టు సీఎల్‌ఎస్‌ఏ నివేదికను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం పెట్రోల్‌పై 19.8 రూపాయలు, డీజిల్‌పై 15.8 రూపాయలను కేంద్రం ఎక్సయిజ్ పన్ను విధించింది. 2021నాడు గరిష్ఠ స్థాయితో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్ డ్యూటీ పెట్రోల్‌పై 40శాతం, డీజిల్‌పై 50శాతంగా ఉన్నది. పెట్రోల్, డీజిల్‌పై పెంచే ప్రతి ఒక్క రూపాయి ఎక్సయిజ్ డ్యూటీతో ప్రభుత్వ ఖజానాకు ఏటా అదనంగా పెట్రోల్‌పై 15,500 కోట్లు, డీజిల్‌పై 5,600 కోట్లు చేరుతాయి. దేశంలో తయారు చేసే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధించేదే ఎక్సయిజ్ డ్యూటీ. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి లేదా అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం (Central government) దీనిని విధిస్తుంది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు (crude oil prices) భారీగా పడిపోయాయి. బుధవారం క్రూడ్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఆయిల్ (Brent Oil) బ్యారెల్‌కు 74.15 డాలర్లుగా, డబ్ల్యూటీఐ 71.16 డాలర్లుగా ఉన్నది. ఈ ధరల తగ్గుదల అనేది భారత చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్(Indian Oil), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (Bharat Petroleum Corporation), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (Hindustan Petroleum Corporation)లకు సానుకూల అంశమని సీఎల్‌ఎస్‌ఏ నివేదిక అభిప్రాయపడింది. అయితే.. ధరల తగ్గింపు ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.